మహా వృక్షాల వయసు ఎలా కనుగొంటారో తెలుసా?

0
215

మహా వృక్షాల వయసు ఎలా కనుగొంటారు అని మనలో చాలామందికి డౌట ఉంటుంది. అడవుల్లో ఏళ్ల తరబడి ఉన్న చెట్ల వయసు లెక్కించే పద్ధతులేంటో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. పెద్ద పెద్ద వృక్షాల కాండాల అడ్డుకోతను పరిశీలించి వాటి వయసును నిర్ధారిస్తారు. చెట్లు పెరగాలంటే అవి విధిగా నీటిని, లవణాలను భూమినుంచే తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం వృక్షం కాండంలో ప్రత్యేకమైన వృక్ష కణజాలం (Plant tissue) ఉంది. ఇందులో ప్రధానమైనది జైలం (Xylem) కణజాలం. వృక్షాలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారైన చెక్కరలను ఇతర భాగాలకు సరఫరా చేసే మరో కణజాలం ఉంది. దానిపేరు ప్లోయం (Floyem). ఈ జైలం, ప్లోయం కణజాలాలు చెట్టు బెరడు కిందనే ఉంటాయి.

ప్రతి ఏటా ప్రత్యేక రుతువులో బాగా వర్షాలు పడడం వలన లవణాల్ని, నీటిని బాగా సరఫరా చేసేందుకు తయారైన ఆహారాన్ని రవాణా చేసేందుకు జైలం, ప్లోయం లు బాగా వదులుగా, పెద్దగా ఉండే కణాల సముదాయంగా ఉంటాయి. దీన్నే కేంద్రీయ పొర అంటారు. కానీ వర్షాలు ఆగిపోతే అననుకూల పరిస్థితుల్లో అవి గట్టి పడతాయి. ఆ తర్వాత సంవత్సరం మళ్లీ కొత్త కేంద్రీయం పాత గట్టిపడ్డ పొరమీద ఏర్పడతాయి. అంటే ప్రతీ ఏటా ఒక కొత్త వలయం లా కణజాలం వృద్ధి చెందుతుంది. ఇలా వలయాకారంలో ఏర్పడ్డ పాత, కొత్త రింగుల స్వరూపంలో తేడా ఉండడం వల్ల మనం సులభంగా వాటిని గుర్తించగలుగుతాము.

ఇలాంటి వలయాలను వార్షిక వలయాలు లేదా వృద్ధి వలయాలు అని పిలుస్తారు. వృక్షం కాండంలో ఉన్న వార్షిక వలయాల సంఖ్యనే దాని వయసు. పడిపోయిన చెట్ల వయస్సును కార్బన్ డేటింగ్ అనే కేంద్రక భౌతిక సాంకేతిక పద్ధతి (nuclear physical radio method) ద్వారా కొలుస్తారు. ఈ విషయాలను వరంగల్ లోని నిట్ ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య వెల్లడించారు.