జూన్ 15 నుంచి రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే విలీన బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్న రైతుబంధు లబ్ధదారులకు కొత్త చిక్కు వచ్చి పడింది. జూన్ 10వ తేదీని కటాఫ్ గా ప్రకటించిన ప్రభుత్వం 15 నుంచి జూన్ 25 వరకు రైతుబంధు డబ్బు పంపిణీ పూర్తిచేయాలని కేబినెట్ ఆదేశించింది. అధికారుల కసరత్తు షురూ అయింది.
ఆంధ్రా బ్యాంకు, దేనా బ్యాంకు, విజయా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఇటీవల కాలంలో ఇతర బ్యాంకుల్లో విలీనమయ్యాయి. తెలంగాణలో ఎక్కువ మంది రైతులకు ఆంధ్రా బ్యాంకు అందుబాటులో ఉంటుంది. ఆంధ్రా బ్యాంకు తెలుగు నేల మీద పెద్ద మొత్తంలో శాఖలు కలిగి ఉంది. దీంతో రైతులు పెద్ద సంఖ్యలో ఈ బ్యాంకులో అకౌంట్లు కలిగి ఉన్నారు. కానీ ఆ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో విలీనమైంది. ఇలా మిగిలిన బ్యాంకులు సైతం విలీనం అయి ఉన్నాయి.
ఆయా విలీనమైన బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. రైతులు ఏ విలీన బ్యాంకులో ఖాతా కలిగి ఉన్నారో… ఆ బ్యాంకులో విలీనం చేసుకున్న బ్యాంకు పేరుతో కొత్త పాస్ బుక్ ఒకటి తీసుకుని దాని జీరాక్స్ ప్రతిని, ఆధార్ కార్డు జీరాక్స్, భూమి పాస్ పుస్తకం జీరాక్స్ కాపీని సంబంధింత మండల వ్యసాయ అధికారి (ఎ.ఓ)కి కానీ, వ్యవసాయ విస్తరణ అధికారి (ఎ.ఇ.ఓ) కి కానీ సమర్పించాలి. అలా సమర్పించకపోతే మాత్రం సదరు రైతులకు రైతుబంధు నగదు జమ కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంబంధిత బ్రాంచ్ కి వెళ్లి కొత్త పాస్ బుక్ తీసుకుని కాగితాలు సమర్పించే పనిలో ఉంటే బెటర్.