I Stand with Mangli : ఎల్లమ్మ పాటపై డాక్టర్ పసునూరి క్లారిటీ

0
34

మంగ్లీ పాడి నటించిన ఒక పాట విషయంలో ఇటీవల మీడియాలో దుమారం రేగుతున్నది. ఈ నేపథ్యంలో మంగ్లి పాడిన, నటించిన పాటలో ఏమాత్రం తప్పులేదని, చరిత్ర, సంస్కృతి తెలియని వారే విమర్శలు చేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రముఖ జర్నలిస్టు, కవి, గాయకుడు, రచయిత డాక్టర్ పసునూరి రవీందర్. ఆయన తన తన అభిప్రాయాలను ఫేస్ బుక్ లో పంచుకున్నారు. ఆయన పోస్టు యదాతదంగా… కింద ఇచ్చాము.

I Stand with mangli నిజం చెప్పులు వేసుకునే లోపే, అబద్ధం ప్రపంచమంతా తిరిగి వస్తుందని గార్షియా మార్క్వేజ్ అన్నట్టు దళిత బహుజనుల సంస్ర్కుతిపై దాడి చేస్తున్నారు.

ప్రముఖ సింగర్ మంగ్లీ ఈ యేడాది బోనాల మీద చేసిన పాట చాలా బాగుంది. అందుకు కారణం పల్లె తెలంగాణ జానపద బాణికి తోడు, చక్కని మేకింగ్ తో అదరగొట్టారు. ఎటొచ్చి ఈ పాటను కొందరు కావాలని వివాస్పదం చేయడమే ఆశ్చర్యకరమైన విషయం.

వారి ప్రధానమైన ఆరోపణ గ్రామ దేవతలను తిడుతూ ఈ పాట రూపొందించారని. నిజానికి ఎవరైనా ఒకరి మనోభావాలను దెబ్బ తీసేలా పాటలు చేసి పెడతారా? ఈ ఆరోపణలన్నీ మన బంజారా బిడ్డ అయిన మంగ్లీకి వచ్చిన పాపులారిటీని దెబ్బ తీసే ఎత్తుగడగా ఉంది.

మంగ్లీ మీద ఈ పాట మీద లేనిపోని విమర్శలు చేసేవారికి అసలు గ్రామ దేవతల కల్చర్ కి, హిందూ బ్రాహ్మణీయ సంస్ర్కుతికి తేడా తెలిసినట్టు లేదు. గ్రామదేవతలను సహజమైన తెలంగాణ భాషలోనే అమ్మ రావే, ఎల్లమ్మ రావే అనే పిలుస్తారు తప్ప, ఎల్లమ్మగారురండి, అమ్మగారు రండి అని పిలవరు. ఇకపోతే అసలు భక్తి సంప్రదాయం లోనే నిందా స్తుతి అనేది ఉంటుందనే కనీస అవగాహన లేని వారే ఈ పాట మీద లేనిపోని దుమారం లేపుతున్నారు.

శివున్ని ప్రేమతో తిడుతూ ఎన్నో పాటలు వచ్చాయి. మీరా బాయి శ్రీక్రిష్ణున్ని రారా క్రిష్ణ అనే సంబోధించింది. మరి వాటి మీద లేని అభ్యంతరం మంగ్లీ మీద ఎందుకో వారే ఆలోచించాలి. ఈ పాటకు లిరిక్స్ అందించిన రామస్వామి గారిని అడిగితే అసలు గ్రామ దేవతల పాటల్లో ఎన్ని బూతు పదాలు ఉంటాయో చెబుతాడు. అలా అని ఈ పాటలో బూతులేమి లేవు. మోతుబరి లాంటి మాటలు అతిశయోక్తితో జత చేసినవే తప్ప, ఒక దేవతను నిందించడానికి కాదని కామన్ సెన్స్ ఉన్న ఎవ్వరికైనా అర్థం అవుతుంది.

ఇక మీడియాకు ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సరీ కావాలి కాబట్టి దీని మీద పనికి రాని చర్చలు పెడుతున్నారు. నిజంగా మంగ్లీ హిందూ మత వ్యతిరేకి అయితే శివుని మీద అంత భక్తి పారవశ్యంతో పాటలు ఎలా పాడుతుందో మరి భక్తులు చెప్పాలి. కాబట్టి ముందు కళాకారులకు లేనిపోనివి అంటగట్టకండి. ఇట్లా అంటగట్టి బురద చల్లాలని చూడడం సాంస్ర్కుతిక దాడే అవుతుంది. బహుజనులంతా మంగ్లీకి అండగా నిలుద్దాం. బహుజన గ్రామ దేవతల సంస్ర్కుతిని కాపాడుకుందాం.