తహసీల్దార్ ఆఫీసుకు పుస్తెలతాడు ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్

0
105

తన భూమి కోసం పోరాడి పోరాడి అలసిపోయి విసిగిపోయి వేసారిపోయిన ఒక మహిళ తన ఆవేదనను, ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియక తహసీల్దార్ ఆఫీసుకు తన తాలిబొట్టును కట్టి ఇది తీసుకునైనా తన భూమి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలంటూ వేడుకుంది. ఈ ఘటన సోషల్ మీడియాలో హోరెత్తింది. బంగారు తెలంగాణలో సామాన్యులు ఎంతగా అవస్థలు పడుతున్నారో అంటూ పెద్ద ఎత్తున రెవెన్యూ సిబ్బందిపై నిరసన వ్యక్తమైంది.

ఈ నేపథ్యంలో ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ జరిగిన సంఘటనపై సీరియస్ అయ్యారు. తక్షణమే దీనిపై విచారణ జరపాలంటూ సిరిసిల్ల ఆర్డీఓ శ్రీనివాస్ ను విచారణాధికారిగా నియమించారు. పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఇవాళ సాయంత్రంలోగా అందజేయాలని కోరారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటానని ప్రకటించారు.

ఎమ్మార్వో ఆఫీసుకు బాధిత మహిళ కట్టిన తాళి

త‌మ భూమిని అధికారులు వేరే వాళ్ల పేర ప‌ట్టా జారీ చేశార‌ని ఆరోపిస్తూ ఒక మహిళ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండలం తహశీల్దార్ ఆఫీస్ గేట్‌కు తాళి కట్టి వేడుకున్ననారు. రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన పొలాస రాజేశం, మంగ దంపతులకు చెందిన భూమి పంచాయతీ ఇది. రాజేశం మూడేళ్ల క్రితం చనిపోయాడు. గ్రామంలోని సర్వే నెంబరు 130/ 14లో 2 ఎకరాల భూమిని తన భర్త మరణానంతరం తహసీల్దార్ కార్యాయల సిబ్బంది వేరే వాళ్ల పేరుమీద పట్టా చేశారని ఆ మహిళ ఆరోపించారు.

ఆమె ఆవేదన ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. భర్త కట్టిన తాళి తీయడం అనేది హిందూ సాంప్రదాయం ప్రకారం ఈజీ కాదు. కానీ ఆమె హృదయం ఎంత వేదనుకు గురైందో దీన్నిబట్టి తెలుస్తోంది. అందుకే ఈ ఘటన పై జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్ సీరియస్ అయ్యారు.

కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో విచారణ ప్రారంభమైంది. వాస్తవ వివరాలతో సమగ్ర రిపోర్ట్ గురువారం సాయంత్రం లోగా ఆర్డీఓ శ్రీనివాస్  అందజేయనున్నారు. ఇప్పటికే ఆర్డీఓ శ్రీనివాస్ క్షేత్ర స్థాయిలో బాధితులు, అధికారుల తో మాట్లాడారు. 2018 లో పట్టామర్పిడి జరిగినట్లు ప్రాథమిక విచారణ లో గుర్తించారు. దాని పై క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారు. బాధిత మహిళకు న్యాయం జరుగుతుందా? లేదా అన్నది అతి త్వరలోనే తేలనుంది.