Actor Chandra Mohan |ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు. 1966లో దివంగత దర్శకుడు బి.ఎన్.రెడ్డి దర్శకత్వం వహించిన ‘రంగులరాట్నం’ సినిమాతో చంద్రమోహన్ తెలుగు చిత్ర పరిశ్రమకు నటుడిగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే నంది అవార్డ్ అందుకున్నారు.’పదహారేళ్ళ వయసు’, ‘సిరిసిరిమువ్వ’, ‘సీతామహాలక్ష్మి’, ‘జీవన తరంగాలు’, ‘మీనా’, ‘ఓ సీత కథ’, ‘సెక్రటరీ’, ‘రెండు రెళ్లు ఆరు’, ‘రాబర్ట్ రామ్ రహీమ్’, ‘శంకరాభరణం’ తదితర చిత్రాలతో చంద్రమోహన్ గుర్తింపు తెచ్చుకున్నారు. 55 ఏళ్ల తన సినీ కెరీర్‌లో మొత్తం 932 సినిమాలు చేసిన చంద్రమోహన్.. హీరోగా 175 సినిమాలు చేశారు.
ఉత్తమ హాస్యనటుడిగా ‘చందమామ రావే’ సినిమాకు గాను 1987లో చంద్రమోహన్ నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తరువాత 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరో నంది సొంతం చేసుకున్నారు. మొత్తం మీద చంద్రమోహన్ 6 నంది పురస్కారాలను అందుకున్నారు. ‘పదహారేళ్ళ వయసు’, ‘సిరిసిరి మువ్వ’ సినిమాలకు గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు. చివరిగా గోపిచంద్ హీరోగా నటించిన ‘ఆక్సిజన్’ చిత్రంలో ఆయన నటించారు. ఒకప్పుడు హీరోయిన్లకు లక్కీ హీరోగా చంద్రమోహన్ పేరు గడించారు. శ్రీదేవి, జయసుధ, జయప్రద, వాణిశ్రీ, విజయనిర్మల లాంటి నటీమణులు చంద్రమోహన్‌తో నటించి విజయవంతం అయ్యారు. దీంతో ఆయనకు లక్కీ హీరోగా ముద్రపడింది. ఇక భార్యాభర్తలుగా చంద్రమోహన్(Actor Chandra Mohan), సుధ కాంబినేషన్ సూపర్‌హిట్ పెయిర్‌గా నిలిచింది.
కళాతపస్వి కె. విశ్వనాథ్, దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, ప్రముఖ నిర్మాత శివలింగ కృష్ణ ప్రసాద్ చంద్రమోహన్ బంధువులు కావడం విశేషం. అలనాటి హీరోలతో పాటు ఈతరం హీరోలతో నటించిన నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.