హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna) డీప్‌ఫేక్ వీడియోపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. రష్మికకు మద్దతుగా హీరోలు నాగచైతన్య, సాయి ధరమ్ తేజ్, హీరోయిన్లు మృణాల్ ఠాకూర్, ప్రియా ప్రకాష్ వారియర్, సింగర్ చిన్మయి(Chinmai) స్పందించారు.
“టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం చూస్తుంటే బాధగా ఉంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. భాదితుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాటిపై కొత్త చట్టాలు అమలు చేయాలి. మీకు మరింత ధైర్యం, బలం చేకూరాలి” అంటూ నాగచైతన్య(Naga Chaitanya) ట్వీట్ చేశారు.
“ఎంతో బాధగా, సిగ్గు చేటుగా అనిపిస్తోంది. ఇలాంటి గొప్ప అద్భుతమైన సాంకేతికతను ఇలా చెడుకు వాడటం, దాని వల్ల బాధితులు ఎంతగా నరకాన్ని అనుభవిస్తుంటారో అని తలుచుకుంటేనే బాధేస్తోంది.. దీని వల్ల భవిష్యత్తులో భయంకరమైన పరిస్థితులు వచ్చేలా ఉన్నాయి.. వెంటనే వీటిపై అవగాహన కల్పించి కొత్త చట్టాలు తీసుకురావాలి” అని సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) డిమాండ్ చేశారు.
మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) స్పందిస్తూ.. “ఇలాంటి పనులు చేసే వారిని తలుచుకుంటే సిగ్గేస్తోంది.. అలాంటి వారిలో కొంచెం కూడా మంచితనం లేదనిపిస్తోంది.. ఇలాంటి విషయాల మీద నోరు విప్పి మాట్లాడినందుకు, సమస్యను అందరి ముందుకు తీసుకొచ్చి రష్మికకు థాంక్స్.. హీరోయిన్ల ఫోటోలు ఎక్కువగా మార్పింగ్ చేస్తారు.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తుంటారు.. అమ్మాయి శరీరాన్ని ఇష్టమొచ్చినట్టుగా మార్ఫ్ చేస్తుంటారు.. ఈ సమాజం ఎటు పోతోంది.. సెలెబ్రిటీలమైన పాపానికి మీరు ఇలా చేస్తారా? అందరూ నోరు విప్పండి.. ప్రశ్నించండి” అని నిలదీసింది. ప్రముఖల స్పందనపై రష్మిక(Rashmika Mandanna) స్పందిస్తూ తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.