Ayodhya Rama Mandir | అయోధ్యలో రామయ్య ప్రాణ ప్రతిష్టాపనకి సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇంకా ఒక్కరోజే గడువు ఉండడంతో కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి. నిర్వాహకులు ఆలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చి దిద్దారు. దేశ విదేశాల నుంచి రానున్న అతిధుల కోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. శ్రీరాముని ప్రతిష్టాపన ఘడియల కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. ఇక ఇదే సమయంలో ఆలయం విశేషాల గురించి తెలుసుకోవడానికి భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని సుందరమైన విగ్రహాలు, భారీ మండపాలు, అద్భుత శిల్ప కళలతో నిర్మించారు. ఆలయ(Ayodhya Rama Mandir) ప్రాంగణంలో రాముడి గర్భాలయంతో పాటు ఇతర మందిరాలు కూడా నిర్మించబడ్డాయి. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం.
పరంపరాగతమైన నాగర శైలిలో మందిరం నిర్మాణం చేయబడుతున్నది.
మందిర పొడవు (తూర్పు-పడమర) 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు. ఎత్తు 161 అడుగులు.
మూడు అంతస్తుల మందిరంలో, ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో, మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి.
క్రింది అంతస్తులోని (గ్రౌండ్ ఫ్లోర్) గర్భగుడిలో – భగవాన్ బాలరాముని (శ్రీ రాంలాల) విగ్రహం, మొదటి అంతస్తు గర్భగుడిలో శ్రీరామ దర్బారు (సీతారామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమాన్ విగ్రహాలు) ఉంటాయి.
నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్ధనా మండపం, సంగీత మండపం – ఇలా మొత్తం 5 మండపాలు ఉంటాయి.
స్తంభాలు మరియు గోడలపై దేవీ, దేవతల వివిధ రూపాలు ఉంటాయి.
ఆలయ ప్రవేశం: తూర్పు వైపు సింహద్వారం నుండి 32 మెట్లు (ఎత్తు 16.5 అడుగులు) ఎక్కి దేవాలయ ప్రవేశం చేయాలి. దివ్యాంగులు మరియు వృద్ధుల కోసం ర్యాంపులు మరియు లిఫ్టులు ఉంటాయి.
నలువైపులా దీర్ఘచతురస్రాకార ప్రాకారం – పొడవు 732 మీటర్లు, వెడల్పు 4.25 మీటర్లు. ప్రాకారపు నాలుగు మూలల్లో సూర్యదేవాలయం, శివాలయం, గణపతి ఆలయం, అమ్మవారి ఆలయం ఉంటాయి.
ప్రాకారానికి దక్షిణం వైపున హనుమంతుని ఆలయం, ఉత్తరం వైపున మాతా అన్నపూర్ణ ఆలయం ఉంటాయి. మందిరం యొక్క దక్షిణ భాగంలో సీతమ్మ వారు ఉపయోగించిన పురాణకాలపు సీతాకూపం (బావి) ఉన్నది.
శ్రీరామ జన్మభూమి మందిర పరిసరాల్లో నిర్మాణం చేయబోయే ఇతర మందిరాలు: మహర్షి వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, నిషాద రాజు గుహుడు, శబరీమాత మరియు అహల్యాదేవి ఆలయాలు నిర్మాణం కానున్నాయి.
నైరుతిలో నవరత్న కుబేర గుట్టపై ఉన్న శివాలయం జీర్ణోద్దరణ కానున్నది. మరియు రామభక్తుడు జటాయువు విగ్రహం నిర్మించబడుతుంది.