Mood of The Nation | త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ మీడియా సంస్థలు జనం నాడిని తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ జాతీయ మీడియా ‘ఇండియా టుడే’ సంస్థ మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తేలింది.
దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాషాయం జెండా రెపరెపలాడుతుందని అంచనా వేసింది. మొత్తం 80 స్ధానాలకు గాను 70 స్ధానాల్లో కమలం పార్టీ విజయం సాధిస్తుందని ఈ సర్వే స్పష్టం చేసింది. సమాజ్ వాద్ పార్టీ 7 స్ధానాల్లో, కాంగ్రెస్ పార్టీ ఒక్క స్ధానంలో విజయం సాధించవచ్చని పేర్కొంది.
మహారాష్ట్రలోని 48 స్థానాలకు గాను బీజేపీ కూటమి 22 స్థానాలను గెలుచుకుంటుందని పేర్కొంది. కాంగ్రెస్-ఉద్ధవ్ ఠాక్రే శివసేన కలిపి 12 స్థానాలు, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 14 స్థానాలు గెలవొచ్చని చెప్పింది. గుజరాత్ రాష్ట్రంలో 26 లోక్‌సభ సీట్లను ఎన్డీయే కూటమి గెలుచుకుంటుందని వెల్లడించింది. పక్కనే ఉన్న పంజాబ్ రాష్ట్రంలో మాత్రం 13 స్థానాల్లో ఇండియా కూటమి 10 స్థానాలు విజయం సాధిస్తుంది.
ఇక పశ్చిమ బెంగాల్‌లో 42 స్థానాలకు గాను మమతా బెనర్జీ నేతృత్వలంలోని తృణమూల్ కాంగ్రెస్ 22 స్ధానాలను దక్కించుకోనుందని తెలిపింది. ఇక బీజేపీ 19 స్ధానాల్లో గెలుపొందుతుందని పేర్కొంది.
అలాగే తమిళనాడుకు సంబంధించి డీఎంకే, కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కూడిన ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేయబోతున్నట్లు తేలింది. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం 39 ఎంపీ సీట్లనూ ఈ కూటమి కైవసం చేసుకుంటుందని వెల్లడించింది.
కేరళ రాష్ట్రంలోని 20 ఎంపీ సీట్లను కూడా ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందని తేలింది. ఆ రాష్ట్రంలో ఉన్న 28 ఎంపీ స్థానాల్లో కమలం పార్టీ 24 స్థానాలు, కాంగ్రెస్ 4 స్థానాలు దక్కించుకుంటాయని వివరించింది.
మొత్తంగా చూసుకుంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 350కు పైగా ఎంపీ సీట్లు వస్తాయని.. ఇండియా కూటమి 193 స్థానాలు గెలుచుకుంటుందని ఈ సర్వే(Mood of The Nation)లో వెల్లడైంది.