అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. నిర్వాహకులు ఆలయ ప్రాంగణమంతా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జనవరి 22న ఆవిష్కృతమయ్యే ఈ అద్భుత ఘట్టానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. రాముడి ప్రతిష్టాపన చూసేందుకు దేశమంతా ఎదురుచూస్తోంది. ఆ శుభ ముహూర్తానికి ఇంకా 11 రోజులే సమయం ఉంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ(PM Modi) తన భావోద్వేగ సందేశాన్ని దేశ ప్రజలకి తెలిజేసారు. తన ఎమోషన్స్ ని ఆడియో రికార్డ్ చేసి మోదీ అధికారిక యూట్యూబ్ చానెల్ లో పెట్టారు. ఆ లింక్ ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.
“అయోధ్యలో రాముని ప్రతిష్టాపనకి ఇంకా 11 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ శుభ సందర్భానికి నేనూ సాక్షిని కావడం నా అదృష్టం. ప్రతిష్ఠాపన సమయంలో భారతదేశ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించడానికి భగవంతుడు నన్ను ఒక సాధనంగా చేసాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నేను ఈరోజు నుంచి 11 రోజుల ప్రత్యేక వ్రతాన్ని ప్రారంభిస్తున్నాను. దీనికోసం ప్రజలందరి ఆశీస్సులు కోరుతున్నాను. ఈ సమయంలో, నా భావాలను మాటలలో వ్యక్తీకరించడం చాలా కష్టం, కానీ నేను నావంతు ప్రయత్నించాను…” అంటూ యూట్యూబ్ లింక్ జత చేస్తూ పోస్ట్ చేశారు.