వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు తధ్యమని ప్రధాని మోడీ(PM Modi) ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు అటువైపే ఉండాలని కోరుకుంటున్నాయని, వారు కోరుకున్నట్టే జరుగుతుందని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మోడీ లోక్ సభ లో మాట్లాడారు. వంద రోజుల్లో మరోసారి మా ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయి, బీజేపీకే సొంతంగా 370కి పైగా సీట్లు వస్తాయని మోడీ అన్నారు. అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మించాం.. భగవాన్ రాముడు తన సొంత ఇంటికి వచ్చాడు. మూడో టర్మ్‌లో కూడా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నామని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లోక్ సభలో మోడీ(PM Modi) వ్యాఖ్యలు:
బీజేపీపై పోటీకి విపక్ష నేతలు వణికిపోతున్నారు. కొంత మంది లోక్‌సభ సీటు మార్చుకున్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా విపక్షాల తీరు మారలేదు. పదే పదే మా ప్రభుత్వంపై చేసిన ఆరోపణలే చేస్తున్నారు. పదేళ్లు విపక్షంలో ఉన్నా కాంగ్రెస్ తీరు మారలేదు. తోటి విపక్ష పార్టీలను కాంగ్రెస్ ఎదగనీయడం లేదు. కాంగ్రెస్ వైఖరి వల్ల దేశానికి, ప్రజాస్వామ్యానికి నష్టం. అవినీతిని అంతం చేసేవరకు విశ్రమించేదిలేదు. కాంగ్రెస్ హయాంలో దర్యాప్తు సంస్థలను రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు. అవినీతి నేతలకు విపక్షాలు సపోర్ట్ చేస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఈడీ కేవలం రూ.5 వేల కోట్లే సీజ్ చేసింది. మా హయాంలో రూ.లక్ష కోట్ల అక్రమ నగదు సీజ్ చేశాం. విచారణ జరపడం దర్యాప్తు సంస్థల పని. వాటిపై విపక్షాలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాయని మోడీ లోక్ సభలో విపక్షాలపై విమర్శలు గుప్పించారు.