మహిళలపై బిహార్ సీఎం నితీశ్‌కుమార్(Nitish Kumar) చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ(PM Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లోని గుణలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ.. ప్రతిపక్షాల అహంకార కూటమిలోని కీలక నేత నితీశ్ కుమార్.. అసెంబ్లీ సాక్షిగా మహిళలను ఉద్దేశించి అసభ్య పదజాలం ఉపయోగించారని మండిపడ్డారు. ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు. కూటమిలోని ఏ ఒక్కనేత కూడా నితీశ్ మాటలను ఖండించలేదన్నారు. మహిళల గురించి చులకనగా మాట్లాడేవారు ప్రజలకు మంచి పనులు ఏం చేస్తారని మోదీ(PM Modi) ప్రశ్నించారు.
ఇటీవల బిహార్‌లో నిర్వహించిన కులగణనకు సంబంధించిన నివేదికను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ మహిళలు విద్యావంతులైతే జనాభా నియంత్రణలో ఉంటుందన్నారు. భార్య చదువుకుంటే గర్భం రాకుండా శృంగారం చేయడం ఎలా అనేది ఆమెకు తెలుసంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విషయం చదువుకున్న మహిళలకు మాత్రమే తెలుస్తుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో నితీశ్ క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండని కోరారు. మరోవైపు బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మాత్రం నితీశ్‌కి మద్దతుగా నిలిచారు. ఆయన కేవలం సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాత్రమే ఆయన మాట్లాడారని ఇందులో తప్పేముందని తెలిపారు.