మేడారం జాతరకు 2.5 కోట్లు నిధులు విడుదల

2.5 crore released for Medaram fair

0
41

మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయనున్నట్టు తెలిపింది. గిరిజనులకు అతిపెద్ద పండుగైన మేడారం జాతర ఏర్పాట్ల కోసం 2.5 కోట్లు నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​రెడ్డి వెల్లడించారు.

ప్రధాని మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం గిరిజన ప్రజల విశిష్ట సంస్కృతి, వారసత్వాన్ని గౌరవిస్తుందని అన్నారు. సమ్మక్క సారలమ్మ మేడారం జాతర గిరిజన పండుగలలో ఒకటని, ఈ పండుగకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని చెప్పారు. గిరిజనులకు గుర్తింపునిచ్చేందుకు, జనాభాలో సుమారు 10 శాతం ఉన్న 705 గిరిజన జాతుల వారసత్వం, సంస్కృతి పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

2014 నుంచి ఇప్పటి వరకు కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ తెలంగాణవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకునే వివిధ పండుగల కోసం 2.45 కోట్లు మంజూరు చేసినట్లు కిషన్​రెడ్డి తెలిపారు. స్వదేశ్ దర్శన్ పథకం, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ గిరిజన సర్క్యూట్‌ల అభివృద్ధిలో భాగంగా 2016-17లోనే దాదాపు 80 కోట్ల రూపాయలతో ములుగు – లక్నవరం – మేడవరం – తాడ్వాయి – దామరవి – మల్లూర్ – బోగత జలపాతాలలో సమగ్ర అభివృద్ధిని చేపట్టినట్లు కిషన్​రెడ్డి తెలిపారు. అందులో భాగంగా మేడారంలో అతిథి గృహం, ఓపెన్ ఆడిటోరియం, పర్యాటకుల కోసం విడిది గృహాలు, తాగునీటి సౌకర్యం, సోలార్ లైట్లు వంటిని ఏర్పాటుచేసినట్లు తెలిపారు.