చంద్రబాబు హయాంలో పెద్ద ఎత్తున విమర్శల పాలైన పథకం ఏదైనా ఉందంటే అది నీరు చెట్టు అనే చెప్పవచ్చు. ఈ పథకంపై అటు అప్పట్లో ప్రతిపక్ష పార్టీ వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీలోని కార్యకర్తలు, చోటా మోటా లీడర్లకు ప్రజాధనం దోచిపెట్టడమే లక్ష్యంగా ఈ నీరు చెట్టు పథకం కొనసాగిందనే విమర్శలు ఉన్నాయి. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాలనే ఉద్దేశ్యంతో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం చివరకు ప్రజాధనం పార్టీ పెద్దల జేబులను తడిపే సాధనంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే దీనిపై విచారణకు కొత్తగా కొలువైన జగన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రమాణ స్వీకారానికి సరిగ్గా వారం రోజుల ముందు ఏకంగా రెండు వేల కోట్ల రూపాయల చెల్లింపులు నీరు-చెట్టు కాంట్రాక్టర్లకు టీడీపీ అనుకూలంగా వ్యవహరించే అధికారి ద్వారా ఆర్థిక శాఖ నుంచి చెల్లింపులు జరిగినట్లు వస్తున్న వార్తలతో ఒక్కసారిగా నూతన సీఎం జగన్ అలర్ట్ అయినట్లు తెలిసింది. అయితే దీనిపై పూర్తి వివరాలు బయటపడిన తర్వాత విచారణ చేపట్టి, చర్యలకు దిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారిందని, దీనిపై శ్వేత పత్రం విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నామని ఇప్పటికే సీఎం జగన్ ప్రకటించారు. అయితే అవకతవకలపై కూడా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎస్ ఎల్వీఎస్ ను ఆదేశించినట్లు తెలుస్తోంది.