పిసిసి చీఫ్ కాగానే బిజెపికి రేవంత్ రెడ్డి 4 పంచ్ డైలాగ్స్ ఇవే

0
107

పిసిసి చీఫ్ కాగానే రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో తన టార్గెట్ ఏమిటో క్రిస్టల్ క్లియర్ గా ప్రకటించారు. తన ఫోకస్ అంతా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ మీద కంటే ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటున్న బిజెపి పైన పెట్టినట్లు కనబడుతున్నది. స్వల్పంగా టిఆర్ఎస్ ను ఎదుర్కొంటూనే… ఇప్పుడిప్పుడే దూకుడు మీదున్న బిజెపిని పండబెట్టే రీతిలో రేవంత్ వ్యూహరచన చేస్తున్నారని పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. పిసిసి చీఫ్ పదవి తీసుకున్న తర్వాత ఇష్టాగోష్టిగా మీడియాతో మాట్లాడిన సమయంలో బిజెపిని ఇరుకునపెట్టే డైలాగ్స్ విసిరారు రేవంత్ రెడ్డి. ఆయన బిజెపిని టార్గెట్ చేసి చేసిన విమర్శలు.. ఆరోపణల్లో ప్రధానమైన 4 అంశాలు చూద్దాం…

1 పాతబస్తీలో ఉన్న ఎంఐఎం కు ఎంత బలముందో తెలంగాణలో బిజెపి పార్టీకి కూడా అంతే బలముంది అనే పంచ్ డైలాగ్ కొట్టారు.

2 జిహెచ్ఎంసిలోని లింగోజిగూడ కార్పొరేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్, బిజెపి కలిసి పోటీ చేసినా ఆ సీటు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అక్కడ పొత్తు కోసం ప్రయత్నం చేసి ప్రగతిభవన్ కు వెళ్లిన స్థానిక బిజెపి నేతల మీద చర్యలు తీసుకుంటానని రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ అప్పట్లో అన్నారు. ఇంకెప్పుడు యాక్షన్ తీసుకుంటారో సమాధానం చెప్పాలి? లేదంటే ఇద్దరి మధ్య స్నేహం ఉన్నట్లే కదా? అని నిలదీశారు.

3 టిఆర్ఎస్ బిజెపి ఒకటేనని… అసలు ఈటల రాజేందర్ ను బిజెపిలోకి పంపిందే కేసిఆర్ అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ వెళ్లి పార్టీలో చేరేందుకు ఈటల వెళ్లిన స్పెషల్ ఫ్లైట్ (ఛార్టెడ్ ఫ్లైట్) ఎవరు అరెంజ్ చేశారో చెప్పాలని బిజెపి నేతలకు సవాల్ విసిరారు.

4 కరోనా వేళ చేయాల్సిన పని వదిలేసి ప్రధాని మోదీ సన్యాసి అవతారమెత్తేందుకు గడ్డం పెంచుతున్నాడు అని చురకలు వేశారు.

రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ పదవి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ కంటే బిజెపి మీదనే ఫోకస్ చేశారనడానికి ఈ విమర్శలు, ప్రశ్నలే నిదర్శనంగా కనబడుతున్నాయి. మరి అసలు ప్రత్యర్థి టిఆర్ఎస్ మీద ఇంకా ఫోకస్ పెట్టలేదని అర్థమవుతోంది. కేసిఆర్ కుటుంబం నుంచి రాష్ట్రాన్ని కాపాడతానని ప్రకటించారు. అలాగే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని స్పష్టం చేశారు. టిఆర్ఎస్ పై చేసిన విమర్శల కంటే బిజెపిపైనే గట్టిగా ఫోకస్ చేసినట్లు కనబడుతున్నది. ముందు చిన్న శత్రువుతో తలపడి తర్వాత పెద్ద శత్రువుతో పోరాడాలనే పాలసీ ఏమైనా పెట్టుకున్నారేమో తలియదు కానీ బిజెపి తొలి టార్గెట్ గా ఎంచుకున్నట్లు పార్టీ వర్గాల్లోనూ టాక్ ఉంది. ప్రత్యర్థులను చిత్తు చేయడంలో రేవంత్ రెడ్డి కంటే ఒక ఆకు ఎక్కువే చదివిన బండి సంజయ్ రేవంత్ రెడ్డికి ఎలా బదులిస్తారో చూడాలి.