కాంగ్రెస్ పార్టీ లో చేరిన పవన్ కళ్యాణ్ అభిమాని

కాంగ్రెస్ పార్టీ లో చేరిన పవన్ కళ్యాణ్ అభిమాని

0
176

నిర్మాత బండ్ల గణేశ్‌ శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు తెరాస ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, తెరాసకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బండ్ల గణేష్ తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీలోని పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.

బండ్ల గణేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ దేశం కోసం ఎంతో త్యాగం చేసిందాని, తనకు కాంగ్రెస్‌ అంటే ఇష్టమని.. అందుకే ఆ పార్టీలో చేరానని అన్నారు. రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకే పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలని కోరితే చేస్తానని.. వద్దంటే ప్రచారం మాత్రమే చేస్తానని పేర్కొన్నారు. తాను జూబ్లీహిల్స్ టిక్కెట్‌ కోరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని’ గణేశ్‌ తెలిపారు.

నిర్మాత బండ్ల గణేష్.. రాజకీయాల్లో అడుగు పెడితే నేను జనసేన తరపు నుండే పోటీ చేస్తా అని పలుమార్లు ఆయన తెలిపారు. పవన్ అడుగుజాడల్లో జనసేన నుండి ఎంపీగా పోటీ చేస్తానంటూ కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు. తాజాగా బండ్ల గణేష్ మీడియా తో మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్‌ తనకు గురువు అని… కానీ చిన్నప్పట్నుంచీ కాంగ్రెస్‌పై ఉన్న ఇష్టంతోనే ఆ పార్టీలో చేరుతున్నానన్నారు. ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయాలన్నది తన కోరికని’ బండ్ల గణేశ్‌ స్పష్టం చేశారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పవన్ కి షాక్ ఇచ్చినట్టు అయింది. ఇక పవన్ అభిమానుల్లో ఈ విషయంపై పెద్ద చర్చ నడుస్తోంది.