తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాల్లో గులాబీ విజయఢంకా మోగించింది. నల్గొండ, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్‌లోని రెండు స్థానాలు అధికార పార్టీ కైవసమయ్యాయి.
ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో తెరాస విజయాల పరంపర కొనసాగుతోంది. శాసనమండలిలో ఇతర రాజకీయ పార్టీలకు అవకాశమే లేదు అన్నట్టుగా ఫలితాలు వచ్చాయి. తమకు ఓట్లు రాకపోతే రాజీనామాలు చేస్తాం అనే మాటలు విన్నాం. కేసీఆర్ పథకాలే నేటి విజయాలకు కారణం అని ఉద్ఘాటించారు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు వాగే వారికి ఈ విజయం చెంపపెట్టు లాంటిది. బీజేపీ, కాంగ్రెస్ లు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. గులాబీ జెండాను తామే కాపాడుకుంటాం అని ప్రజలు అంటున్నారు.
కాంగ్రెస్- బీజేపీ ప్రజాప్రతినిధులు సైతం కేసీఆర్ అభివృద్ధికి ఓటు వేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు సైతం టిఆర్ఎస్ పథకాలు అందుతున్నాయి. పచ్చని తెలంగాణను నాశనం చేసేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి. అధికార పార్టీ ఓట్లు తమకే పడతాయని ప్రతిపక్ష పార్టీ నేతలు గాల్లోమేడలు కట్టుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారనడానికి నిదర్శనం. మేము ఎవరికి బయపడం- జాతీయస్థాయిలో టీఆర్ఎస్ పథకాలు వచ్చేలా ప్రణాళికలు వేస్తాం. ఎంపిటిసిల సమస్యలు కొన్ని తీర్చాము. భవిష్యత్ లో అన్ని సమస్యలు పరిష్కారానికి సీఎం కృషి చేస్తారని మంత్రి తలసాని పేర్కొన్నారు.
తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారికి సీఎం కేసీఆర్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనచారి పేరును ప్రతిపాదిస్తూ రాజ్‌భవన్‌కు ఫైలును పంపించగా…గవర్నర్ తమిళిసై ఇందుకు ఆమోదం తెలిపారు. ఈ సందర్బంగా మధుసూదనాచారి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు. నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. టీఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తా. ఉద్యమంలో సుదీర్ఘ కాలం కేసీఆర్ తో పని చేసే అవకాశం నాకు దక్కింది. ఇప్పుడు అభివృద్ధిలో కలిసి పని చేసే అవకాశం సైతం దక్కిందని తన అభిప్రాయాన్ని తెలిపారు.