తెలంగాణ బీజేపీలో లుకలుకలు..సొంత గూటికి కరీంనగర్ మాజీ మేయర్

Karimnagar is the former mayor of his own Gooty

0
38

ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్‌కు ధీటైన పార్టీ బీజేపీ మాత్రమే. కాంగ్రెస్‌లో ఉన్న లుకలుకలు వల్ల..ఆ పార్టీ పుంజుకోలేకపోతుంది. అయితే అనూహ్యంగా పుంజుకుంటున్న బీజేపీలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అందరూ కలిసికట్టుగా పనిచేసి…అధికార టీఆర్ఎస్‌ని గద్దె దించాల్సిన సమయంలో…ఆధిపత్య పోరుతో వ్యతిరేకత వస్తుంది. దానితో ఇప్పుడు బీజేపీలో కూడా లుకలుకలు మొదలవుతున్నట్లు కనిపిస్తున్నాయి.

ఈటల రాజేందర్ బీజేపీలోకి వచ్చాక..జిల్లాలో బీజేపీ పుంజుకున్న విషయం తెలిసిందే. ఇటీవల కరీంనగర్ జిల్లాలోని ఒక ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్ఎస్ రెబల్‌గా బరిలోకి దిగిన రవీందర్ సింగ్‌.. ఎన్నికల తరువాత బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ద్వారా ఆయన బీజేపీలోకి వెళతారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. రవీందర్ సింగ్‌కు ఓటేసిన బీజేపీ నేతలకు ఆ పార్టీ నోటీసులు జారీ చేసింది. పార్టీ బరిలో నిలపని అభ్యర్థికి ఎందుకు ఓటేశారని ప్రశ్నించింది. దీంతో రవీందర్ సింగ్‌కు ఈటల రాజేందర్ మద్దతు ఉన్నా..బీజేపీ మద్దతు లేదనే విషయం తేలిపోయింది. అంతేకాదు ఈటల రాజేందర్ ద్వారా బీజేపీలోకి వెళ్లాలని భావించిన రవీందర్ సింగ్ ప్రయత్నాలు ఫలించలేదు.

రవీందర్ సింగ్‌ను పార్టీలో చేర్చుకునేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అంత సుముఖంగా లేరనే వార్తలు వచ్చాయి. రోజులు గడుస్తున్నా.. రవీందర్ సింగ్ బీజేపీలో చేరకపోవడంతో.. ఆయనకు బీజేపీ నో ఎంట్రీ బోర్డు పెట్టిందనే ఊహాగానాలు నిజమే అనే ప్రచారం మొదలైంది. దీంతో ఆయన మళ్లీ టీఆర్ఎస్ గూటికి వెళతారనే ప్రచారం మొదలైంది. తాజాగా హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో రవీందర్ సింగ్ సీఎం కేసీఆర్‌ను కలవడంతో.. ఆయన మళ్లీ సొంత గూటికి చేరుకున్నట్టు అయ్యింది. అయితే ఆయనను మళ్లీ పార్టీలో చేర్చుకోవద్దని కొందరు టీఆర్ఎస్ నేతలు పార్టీ నాయకత్వాన్ని కోరినట్టు తెలుస్తోంది. అయితే రవీందర్ సింగ్‌ను మళ్లీ పార్టీలో చేర్చుకోవడం వెనుక సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు అర్థమవుతోంది. మొత్తానికి మళ్లీ టీఆర్ఎస్ గూటికి వెళ్లిన రవీందర్ సింగ్ ఎపిసోడ్‌ ఈటల రాజేందర్‌కు మైనస్‌గా మారుతుందో చూడాలి మరి.