తెలంగాణ పాలిటిక్స్ లో ఒకే ఒక్కడు : ఈటల ఖాతాలో కొత్త రికార్డ్

0
36

ఫ్యూడల్ వ్యవస్థ అంతం… ఆత్మ గౌరవ నినాదం పేరుతో ఈటల రాజేందర్ శనివారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ స్వరాష్ట్రంలో ఈటల రాజేందర్ ఒకే ఒక్కడుగా రికార్డు సృష్టించారు. ఆ వివరాలు మీకోసం…

టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు కావొస్తున్నది. ఇలా ఏడేళ్ల కాలంలో అధికార టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తొలి ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ రికార్డు దక్కించుకున్నారు. ఇప్పటి వరకు అధికార టిఆర్ఎస్ నుంచి ఏడేళ్లలో ఏ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయలేదు.

19 ఏళ్ల ప్రస్తానంలో ఈటల రాజేందర్ కేసిఆర్ అడుగుజాడల్లో నడిచిన నాయకుడు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా… ఆచరించిన వ్యక్తి. అయితే తనకు నచ్చని అంశాలను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పార్టీ అధినేతకు చెప్పే ప్రయత్నం చేశారు. కోటీశ్వరులకు రైతు బంధు ఇవ్వడం లాంటివి, ఐకెపి సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం లాంటివాటిని గులాబీ బాస్ నోటీసుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకస్వామ్య పార్టీలే అని అందరికీ తెలిసిందే. పార్టీ అధినేత ఏది చెబితే అదే ఫైనల్.

కానీ గత రెండేళ్ల కాలంగా కేసిఆర్ తో ఈటలకు బొత్తిగా పొసగలేదు. దీంతో భూకబ్జా ఆరోపణలు కాయించి ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. తర్వాత ఆయనను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారేమో అనుకున్నారు.. కానీ జరగలేదు. ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తొలగించలేదు. ఇక కేసిఆర్ తో ఒకసారి తెగితే అతకదు అన్న క్లారిటీ ఉన్న ఈటల అంతిమంగా బిజెపి వైపు అడుగులేశారు.

తెలంగాణ రావడం, టిఆర్ఎస్ అధికారంలోకి రావడం జరిగిన తర్వాత బర్తరఫ్ అయిన మంత్రుల్లో ఈటల రెండోవాడు. మొదటి వ్యక్తి తాటికొండ రాజయ్య. ఆయన ఏం నేరం చేశారో.. ఏం పాపం చేశారో.. ఎవరికి చెడు చేశారో.. అనేది చిందబర రహస్యం. కానీ ఉన్నఫలంగా కేసిఆర్ ఆయన మంత్రివర్గం నుంచి రాజయ్యను తీసిపడేశారు. ఐదేళ్లు గడుస్తున్నా… రాజయ్యను ఎందుకు తొలగించారో ఇప్పటి వరకు ఆయన  కానీ, కేసిఆర్ కానీ బయట ఎక్కడా చెప్పలేదు.

తాటికొండ రాజయ్య ఎపిసోడ్ తర్వాత అంతటి కుదుపు కుదిపిన ఘటన ఈటలదే. వీరిద్దరి మధ్యలో మరో కీలక నేత, కేసిఆర్ కుటుంబసభ్యుడైన హరీష్ రావు వ్యవహారం కూడా చెప్పుకోవాలి. హరీష్ రావును కొంతకాలం ప్రగతిభవన్ లోకి రానీయలేదు. ఆయన వార్తలను టిఆర్ఎస్ అనుకూల పత్రిక నమస్తే తెలంగాణలో బ్యాన్ చేశారు. సొంత ఛానెల్ టిన్యూస్ లో నిషేదించారు. తర్వాత ఏమైందో ఏమో కానీ… హరీష్ రావు మెల్లమెల్లగా కేసిఆర్ కు దగ్గరయ్యారు. ఇప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో యాక్టీవ్ అయ్యారు. టిఆర్ఎస్ లోహరీష్ రావు ఎక్కువగా అవమానాలపాలైనాడు అని ఈటల చేసిన కామెంట్ ను హరీష్ సీరియస్ గా ఖండించారు. తన భుజాల మీద తుపాకీ పేల్చే ప్రయత్నం చేయొద్దన్నారు. హరీష్, కేసిఆర్, కేటిఆర్ మధ్య బంధం ఇప్పుడు స్ట్రాంగ్ గానే ఉన్నట్లు కనబడుతున్నది.

మొత్తానికి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి నేటి వరకు తాటి కొండ రాజయ్య బర్తరఫ్ ఇష్యూ.. హరీష్ రావు కు ఉక్కపోత వ్యవహారం.. ఇప్పుడు ఈటల బర్తరఫ్, రాజీనామా ఎపిసోడ్ అనేవి రాజకీయాలను కుదిపేసిన ఘటనలు. ఇందులో అధికార టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తొలి వ్యక్తిగా ఈటల రికార్డు నెలకొల్పారు.