తెలంగాణలో బిజెపికి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల ఆ పార్టీకి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ గుడ్ బై చెప్పారు. ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరతానని ప్రకటించారు.
ఇక దుబ్బాక, జిహెచ్ఎంసిలో సత్తా చాటిన బిజెపి తర్వాత నాగార్జున సాగర్ లో డిపాజిట్ గల్లంతవడంతో డీలాపడింది. ఆ తర్వాత వరుసగా ఆ పార్టీ ఇబ్బందులకు గురవుతూ వస్తోంది. ఒకవైపు టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అన్నంతగా ఇప్పటవరకు దూకుడు ప్రదర్శించిన ఆ పార్టీకి టిపిసిసి చీఫ్ గా రేవంత రెడ్డి నియామకం జరిగిన తర్వాత దూకుడు తగ్గిందన్న ప్రచారం ఉంది. అయితే తాజాగా మాజీ టిడిపి నేత, ప్రస్తుత హుజూరాబాద్ బిజెపి నేత అయిన ఇనగాల పెద్ది రెడ్డి బిజెపికి గుడ్ బై చెప్పారు.
ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆయనకు తెలియకుండానే హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ను పార్టీలోకి చేర్చుకున్నారని ఇప్పటి వరకు పార్టీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. అంతేకాకుండా ఈటలకు ప్రత్యర్థి కూడా కావడంతో ఈటల చేరికను పెద్దిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఎలాగైనా పొసగదు అన్న భావనతో ఆయన పార్టీని వీడే చాన్స్ ఉందని చెబుతున్నారు. అయితే పెద్దిరెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది తెలియరాలేదు. ఆయన టిఆర్ఎస్ లో చేరతారా? కాంగ్రెస్ వైపు వెళ్తారా అనేది తేలాల్సి ఉంది.