హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డ్రెస్ కోడ్‌పై ఎవరినీ బలవంతంచేయొద్దన్న న్యాయస్ధానం.. ఈ సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరచుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హిజాబ్ అంశంపై ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్ అవస్థి న్యాయమూర్తులు కృష్ణ ఎస్ దీక్షిత్ మరియు జెఎం ఖాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వివిధ పిటిషన్లపై విచారణను ప్రారంభించింది.
హిజాబ్ వద్దు.. కాషాయం వద్దు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు విషయంలో న్యాయమూర్తుల వ్యాఖ్యలను కూడా ఏ సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. తుది తీర్పు వచ్చేంత వరకూ హిజాబ్ వివాదాన్ని వద్దంటూ పేర్కొంది. తుది తీర్పు వచ్చే వరకు విద్యార్థులు హిజాబ్ ప్రస్తావన తీసుకురావద్దని సూచించింది. హిజాబ్ వివాదంపై సోమవారానికి విచారణను వాయిదా వేసింది.
ఏమిటీ హిజాబ్ వివాదం
కర్ణాటకలోని ఓ ప్రభుత్వ కళాశాలలో తరగతి గదిలో హిజాబ్ ధరించడాన్ని నిరాకరించడంతో హిజాబ్ వివాదం మొదలైంది. దీనిపై 8 మంది ముస్లిం విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. తరువాత చాలా కాలేజీల్లో ఈ వివాదం మొదలైంది. ఈమధ్య ఓ కాలేజీలో హిజాబ్ ధరించిన అమ్మాయిలను విడిగా కూర్చోబెట్టారు. ఈ విషయంపై నిరసనలు కొనసాగుతున్నాయి.