మానవత్వమా..నీవెక్కడ?

Humanity..where are you?

0
103

హైదరాబాద్ మెట్రోలో మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన నెలలు నిండని పసిబిడ్డను ఎత్తుకొని మెట్రో రైలులో కింద కూర్చోవడం అందరిని కలచివేసింది. పక్కనే యువతులు, యువకులు సీట్లలో కూర్చొని ఉన్నా సరే..కింద పసి బిడ్డతో కూర్చున్న ఆ తల్లికి కనీసం సీటు కూడా ఇవ్వకపోగా పట్టించుకున్న పాపాన పోలేదు.

అసలు ఏమి జరిగిందంటే..నెలలు నిండని ఆ పసికందును ఎత్తుకొని మెట్రో రైలు ఎక్కింది ఆ మహిళ. అప్పటికే సీట్లన్నీ నిండిపోవడంతో ఎక్కడా కూర్చునే అవకాశమే లేదు. అక్కడ సీట్లలో ఉన్న వారిని అడిగితే ఏమంటారో అనుకోని ఆ మహిళ కదిలే రైలులో పసిబిడ్డతో ఎక్కువ సేపు నిలబడలేక రైలులోనే సీట్ల పక్కన కింద కూర్చుంది.

ఆ పక్కనే సీట్లలో యువతులు, మహిళలే ఎక్కువగా కూర్చొని ఉన్నారు. చేతుల్లో శిశువుతో ఉన్న ఆ అమ్మను చూసి ఎవరికీ దయ కలగలేదు. కింద కూర్చుని..ఒళ్లో బిడ్డను ఉంచుకుని ప్రయాణించింది. హైదరాబాద్‌ మెట్రోలో జరిగిన సంఘటనను ఎవరో వీడియో తీసి ‘గ్రేట్‌ ఎడ్యుకేటెడ్‌ ఉమెన్‌ ఇన్‌ హైదరాబాద్‌’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.

మెట్రోరైలులో అక్కడ ఉన్న ఏ ఒక్కరూ స్పందించకపోవటం..బాలింత అనే కనికరం చూపకపోవటంపై నెటిజన్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇంత పెద్ద చదువులు పూర్తి చేసిన మహిళలు కనీస మానవత్వం చూపకపోవటం వారి సంస్కారహీనానికి నిదర్శనమని కామెంట్లు చేశారు.