వైఎస్సార్‌కు జగన్ మోహన్ రెడ్డి నాన్న

వైఎస్సార్‌కు జగన్ మోహన్ రెడ్డి నాన్న

0
133

బికామ్‌లో ఫిజిక్స్ అనగానే టక్కున గుర్తుచ్చే పేరు జలీల్ ఖాన్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేగా ప్రస్తుతం వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ఆయన మాట్లాడే విధానంతో అందరిని కడుపుబ్బా నవ్విస్తారు. జలీల్ ఖాన్ ఎప్పుడు మీటింగ్‌ల్లో పాల్గొన్న ఆయన మాటల్లో తడబాటుతో తప్పులో కాలేసి చిక్కుల్లో పడుతుంటారు. తాజాగా గుంటూరులో ఏర్పాటు చేసిన ‘టీడీపీ హమారా.. నారా హమారా..’ కార్యక్రమంలో మైనార్టీల సమస్యలపై జలీల్ ఖాన్ మాట్లాడుతూ మరోసారి తప్పులో కాలేశారు. టీడీపీ చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ప్రసంగం మొదలు పెట్టిన జలీల్ ఖాన్.. కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌సీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గతంలో 125 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ ముస్లింలకు చేసింది ఏమి లేదని విమర్శించిన ఆయన.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించబోయి తడబడ్డారు. ‘రాయలసీమలో ముస్లింలను ఎదగకుండా చూసిన చరిత్ర రాజశేఖర్ రెడ్డి వాళ్ల నాన్న.. జగన్ మోహన్ రెడ్డిది..’ అనడంతో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. బికామ్‌లో ఫిజిక్స్ ఉన్నట్టుగానే.. వైఎస్సార్‌కు జగన్ మోహన్ రెడ్డి నాన్న అంటూ మరోసారి హ్యాస్యాన్ని పండించారు.

అదేవిధంగా శనివారం అమరావతిలో జరిగిన నారా హమారా.. టీడీపీ హమారా కార్యక్రమంలో మాట్లాడుతూ.. తుని ఘటన తరహాలో గొడవ చేసేందుకు వైసీపీ పథకం రచిస్తోందని జలీల్ ఖాన్ మండిపడ్డారు. ప్రత్యర్థి పార్టీల్లో అల్లర్లు చేయడం జగన్‌కే కాదు.. ఆయన తాత, తండ్రీకి అలవాటేనని విమర్శించారు. జగన్ అధికారంలోకి వస్తే ఫ్యాక్షనిజం పెరుగుతుందని జలీల్ ఖాన్ విరుచకపడ్డారు. కాగా, 2004లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ జెండాపై గెలిచిన జలీల్ ఖాన్.. చంద్రబాబు ఆకర్ష్ మంత్రంతో రాత్రికి రాత్రే టీడీపీ తీర్థం పుచ్చేసుకున్నారు. చంద్రబాబు కేబినెట్‌‌లో మైనార్టీ శాఖ ఖాళీగా ఉండటంపై కన్నేసిన జలీల్ ఖాన్.. రాజీనామా చేయకుండా టీడీపీలోకి జంప్ చేసి ఫిరాయింపు ఎమ్మెల్యేగా పార్టీలో కొనసాగుతున్నారు.