కరోనా విపత్కర పరిస్థితుల దృష్ట్యా నిరుపేదలకు ఉచితంగా అందించిన బియ్యం, ఇతర ఆహార ధాన్యాల పంపిణీ నవంబర్ తర్వాత నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ పథకం కింద పేదలకు ఉచితంగా బియ్యం గోధుమల పంపిణీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది.
గడువు పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆహార ధాన్యాల పంపిణీని కొనసాగించే అంశమై ఎలాంటి ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే ఇటీవలే ప్రకటించారు.
కోవిడ్-19 మహహ్మరి వ్యాప్తి, లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా కేంద్రం ప్రభుత్వం ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు ఉచితంగా 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పును పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అనంతరం దీన్ని ఈ ఏడాది నవంబర్ వరకు పొడిగించారు.
ఈ పథకం ద్వారా కేంద్ర ఆహార భద్రతా చట్టం పరిధిలోని 80 కోట్ల మందికి లబ్ధి చేకూరింది. ఇందుకోసం రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పథకాన్ని మరో ఆరు నెలల పాటు కొనసాగించాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణముల్ కాంగ్రెస్ తదితర విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం లెక్క చేయడం లేదు.