షాకింగ్ న్యూస్ : కోదండరాం సన్నిహితుడు టిఆర్ఎస్ గూటికి…

0
99

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జన సమితి పేరుతో పార్టీని స్థాపించిన కోదండరాం కు ఊహించని పరిణామం ఇది. ఆ పార్టీకి ముఖ్య నేతల్లో ఒకరైన పంజుగుల శ్రీశైల్ రెడ్డి గుడ్ బై చెప్పారు. అతి త్వరలో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే కోదండరాంను తనకు రాజకీయ విద్య నేర్పిన గురువుగానే చివరి వరకు గుర్తుంచుకుంటానని శ్రీశైల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే శ్రీశైల్ రెడ్డి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ తో భేటీ అయ్యారు. త్వరలోనే టిఆర్ఎస్ గూటికి చేరనున్నట్లు వెల్లడించారు.

శ్రీశైల్ రెడ్డి తెలంగాణ జన సమితిలో పొలిటికల్ అఫైర్స్ కమిటీకి ఛైర్మన్ గా ఉన్నారు. ఇప్పటికే టిజెఎస్ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందన్న వార్తలొస్తున్న తరుణంలో శ్రీశైల్ రెడ్డి తన దారి తాను వెతుక్కోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. శ్రీశైల్ రెడ్డి రాసిన రాజీనామా లేఖ దిగువన యదాతదంగా ప్రచురించాం… చదవొచ్చు. ఈనెల 16వ తేదీన ముఖ్యమంత్రి కేసిఆర్ సమక్షంలో శ్రీశైల్ రెడ్డి టిఆర్ఎస్ లో అధికారికంగా చేరనున్నారు.

హైదరాబాద్
11 జూలై, 2021

టీజేఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, పెద్దలు శ్రీ కోదండరాం సర్ కి అత్యంత గౌరవాభిమానాలతో…

సర్,

టీజేఎస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీకి, ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం చైర్మన్ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.

తెలంగాణ సమాజంకోసం రాజకీయంగా చేయాల్సినంత చేయలేకపోతున్నామని, టీజేఎస్ ఆ దిశగా ముందుకు పోవడం లేదని, ఇంకా ఉద్యమపంథా తప్ప రాజకీయ ధోరణి లేదనే తీవ్ర అసంతృప్తితో, బాధతో చాలా మథనం తర్వాత; లోతైన, సునిశితమైన వివేచన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. ఇది మీతో పాటు నాకూ బాధ కలిగించినా, ఆ వ్యక్తిగత ‘హర్ట్’ను దాటి చూస్తే… మనందరం సంకల్పం చెప్పుకున్న రాజకీయ లక్ష్యాల కోసం చేస్తున్న పని సరిపోనపుడు, సవ్యదిశలో పోనపుడు, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిన సందర్భంలో తీసుకున్నదే ఈ నిర్ణయం.

ఒకవైపు ఫాసిజం, మరోవైపు ఆంధ్రా నాయకుల కనుసన్నలలో జరుగుతున్న రాజకీయాలు, కొండంత నిష్క్రియాపరత్వంలో కూరుకుపోయి రాజకీయ అడుగులు వేయలేని శ్రేణులు… ఇదీ ప్రస్తుత రాష్ట్ర రాజకీయ యవనిక. ఈ పరిస్థితిలో మరింత రాజకీయ క్రియాశీలతతో పనిచేయడానికి నేను టీజేఎస్ నుంచి వైదొలగక తప్పడంలేదు.

ఏ వేదికలో ఉన్నా తెలంగాణ శ్రేయస్సు కోసమే నేను పనిచేస్తానని, అందుకోసం శక్తివంచన లేకుండా, ఆత్మవంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను, దీనిని మీరు నమ్ముతారనీ ఆశిస్తున్నాను. 33 సంవత్సరాల క్రితం పౌరహక్కుల సంఘంలో మీతో మొదలైన ప్రయాణంలో ఎన్నో నేర్చిన నేను, ఇప్పటికీ మీ నుంచి నేర్చుకుంటున్న నేను… ఆ పాఠాలను ఎప్పటికీ మరువనని, రాజకీయ కార్యాచరణకు ఆ వెలుగు ఒక దిక్సూచిలా భావిస్తాననీ, అందుకోసం పనిచేస్తానని ప్రామిస్ చేస్తున్నాను.

మీతో సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీజేఎస్ పార్టీ నాయకులు, మిత్రులు అందించిన సహకారానికి, అభిమానానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ… సెలవు.

జై తెలంగాణ.

ఇట్లు

శ్రీశైల్ రెడ్డి పంజుగుల