గత వారం రోజుల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల విషయం హాట్ టాపిక్‌గా నడిచింది. కానీ ఆ మూడు రాజధానుల బిల్లుని, సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు బిల్లలను ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదించారు. అనంతరం ఈ బిల్లులు శాసన మండలిలో ఆమోదం పొందాలి. కానీ ఇక్కడే జగన్ సర్కారికి ఊహించని చిక్కు ఎదురైంది. మండలిలో తెదేపాకు ఎక్కువ బలం ఉండటంతో ఈ బిల్లులను అడ్డుకోవడానికి చంద్రబాబు దగ్గర ఉన్న అస్త్రాలన్నింటిని ప్రయోగించి బిల్లును ఆమోదించకుండా సెలెక్ట్ కమిటీకి పంపించారు.
దీంతో ముఖ్యమంత్రి జగన్ గతంలో తెదేపా వ్యవస్థాపకుడు ఎన్‌టీ.రామారావు బాటలో పయనించాలని నిర్ణయించుకున్నారు. మండలి సక్రమంగా పనిచేయనప్పుడు మండలి ఉండి ప్రయోజనం ఏంటి.. ఈ విషయాన్ని ఆలోచించాలని ప్రజలకు సూచించారు. అనుకున్నదే తడవుగా మండలి రద్దును అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం ఆమోదించింది.
రాజ్యాంగ రూపకర్తలు ఎంతో ముందు చూపుతో రాష్ట్రాలలో రెండు సభల ఏర్పాటుకు అవకాశం కల్పించారని, ఏదైనా ఒక బిల్లుపై శాసనసభలో పొరపాటు నిర్ణయం తీసుకున్నప్పుడు దానిపై పెద్దల సభలో మేథోపరమైన మధనం చేసి అటువంటి బిల్లులను సరిదిద్దడానికి శాసన మండలికి రూపకల్పన చేశారు.
ఇంతటి ఉన్నత ఆశయంతో ఏర్పాటైన మండలిని మన రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రద్దు చేయడం సబబు కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థలను తొలగించుకుంటూ పోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కొందరు మేధావులు అభిప్రాయపడుతున్నారు. కానీ వైకాపా ప్రభుత్వం వేగానికి కేంద్ర మరింత వేగం పెంచుతుందా.. లేక కళ్లెం వేస్తుందా అని వేచి చూడాలి. ఫ్రిబ్రవరి 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో మండలి రద్దు బిల్లును పార్లమెంటులో ఆమోదిస్తారా.. తిరస్కరిస్తారా.. అసలు అక్కడ ఈ బిల్లుపై చర్చించడానికి వారికి అంత సమయం ఉందా.. ఇదంతా జరిగే పని కాదని తేదేపా నాయకులు ధీమా ఉన్నారు.