తెలంగాణలో బిజెపికి గుడ్ బై చెప్పనున్న లీడర్ల లిస్ట్

0
44

తెలంగాణ పిసిసి చీఫ్ మార్పు తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఆ పార్టీ నేతలు కొత్త ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఇక ఘర్ వాపసీ కార్యక్రమాన్ని చేపట్టారు పిసిసి ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి. వివిధ కారణాల వల్ల పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్లిపోయిన వారందరినీ మళ్లీ పార్టీలోకి స్వాగతిస్తున్నారు రేవంత్ రెడ్డి. దానిలో భాగంగా ఇప్పటికే కొందరు వచ్చి చేరారు. మరికొందరు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇటీవల రేవంత్ రెడ్డిని కలిశారు. పార్టీలో చేరతానని ప్రకటించారు. ధర్మపురి సంజయ్ ప్రస్తుత టిఆర్ఎస్ రాజ్యసభసభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కొడుకు. ప్రస్తుత నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్ కు అన్న.

ఇక టిడిపి మాజీ ఎమ్మెల్యే అయిన ఎర్ర శేఖర్ కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. ఆయన టిడిపి నుంచి బిజెపి వెళ్లిపోయారు. బిజెపిలో మహబూబ్ నగర్ జిల్లా శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరతారు.

ఇక రేవంత్ రెడ్డి తన వ్యూహచతురతతో మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత దేవేందర్ గౌడ్ ను కలిశారు. దేవేందర్ గౌడ్ రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం ముగిసిన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరలేదు. అయితే ఆయన తనయుడు వీరేందర్ గౌడ్ మాత్రం బిజెపిలో ఉన్నారు. ఇప్పుడు వీరేందర్ గౌడ్ బిజెపికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరనున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి తాను బిజెపిలోనే ఉంటానని కాంగ్రెస్ లో చేరనని వీరేందర్ గౌడ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం వస్తాడని బల్లగుద్ది చెబుతున్నారు.

భూపాలపల్లి నేత గండ్ర సత్యనారాయణ ఇటీవల రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ లో చేరనున్నారు.

ఇక కొత్తగా చేరతారని ఊహాగానాలు వినబడుతున్నవారి పేర్లు పరిశీలిస్తే మాజీ మంత్రులు, సీనియర్ నేతలు కూడా ఉన్నారు.
టిడిపి నుంచి బిజెపికి వెళ్లిన మాజీ మంత్రి ఇనగాల పెద్దిరెడ్డి బిజెపిలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఆయన కాంగ్రెస్ లోకి రావొచ్చని టాక్. ఈయన ఉమ్మడి కరీంనగర్ లోని హుజూరాబాద్ కు చెందిన నేత. ఇక్కడ ఈటల రాజేందర్ ను బిజెపిలోకి తీసుకున్న నాటినుంచి గుర్రుగా ఉన్నారు.

ఇక మరో మాజీ మంత్రి బోడ జనార్దన్ కూడా బిజెపికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరే చాన్స్ ఉందంటున్నారు. ఈయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నాయకుడు. ఈయన టిడిపి నుంచి బిజెపికి వెళ్లిన నాయకుడే.

టిడిపిలో హన్మకొండ మాజీ ఎంపీగా పనిచేసిన చాడ సురేష్ రెడ్డి ప్రస్తుతం బిజెపిలో ఉన్నారు. ఆయన బిజెపికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరవచ్చని ప్రచారంలో ఉంది.

శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ బిజెపిలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డితో స్వామిగౌడ్ కు సన్నిహిత సంబంధాలున్నాయి.

కేసిఆర్ సొంత అన్న కూతురు రావులపాటి రమ్యారావు కూడా కాంగ్రెస్ లో చేరవచ్చని టాక్ ఉంది. ఆమెతో కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు.

టిడిపిలో రాజకీయంగా ఎదిగి కేసిఆర్ వ్యతిరేక శక్తులన్నీ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు రాజకీయ వాతావరణం కనబడుతున్నది. అలాంటి వారిని క్యాచ్ చేసే పనిలో రేవంత్ రెడ్డి నిమగ్నమయ్యారని టాక్ ఉంది.

అయితే బిజెపిలో సీనియర్ నేతలైన పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి లాంటి నాయకులు సైతం అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారంలో ఉంది.

దీనికి సంబంధించి Shadow Tv అనే యూట్యూబ్ ఛానెల్ లో ప్రసారమైన వీడియో క్లిప్ పైన ఉంది చూడొచ్చు.