వాళ్ళు బీజేపీకి లొంగిపోయారు-రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

They surrendered to the BJP-Rewanth Reddy sensational remarks

0
102

ఏపీ, తెలంగాణ విభజనపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలతో.. రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా మోడీ వ్యాఖ్యలపై స్పందించని సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ ఉభయ సభల్లో తెలంగాణ అస్థిత్వాన్ని ప్రశ్నించి, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను తప్పు పడితే కేసీఆర్, ఆయన కుటుంబం ఐదు రోజులుగా ఎక్కడ నిద్రపోతోందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

మోదీ వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందిస్తారని, అవసరమైతే రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చి నిరసన తెలుపుతారని తెలంగాణ సమాజం భావించిందని..కానీ, భయమే, భక్తో తెలియదు కేసీఆర్ బయటకు వచ్చి ఇంత వరకు స్పందించలేదన్నారు. తెలంగాణ కోసమే పుట్టానని చెప్పే కేసీఆర్ కు మోదీ వ్యాఖ్యలు తప్పుగా అనిపించ లేదా అని ప్రశ్నించారు. మోదీ సభలో తెలంగాణ ప్రజలను అవమానిస్తూ మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ, మల్లికార్జున ఖర్గే అడ్డు తగిలి, సభ నుంచి వాకౌట్ చేశాం తప్ప… అదే సభలో ఉన్న టీఆర్ఎస్ ఎంపీలు మౌనంగా ఉన్నారని గుర్తు చేశారు. ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనలతో భగ్గుమని స్పందించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో టీఆర్ఎస్ నేతలను రోడ్లపైకి పంపారన్నారు.

అందులోనూ అంతా తెలంగాణ ద్రోహులైన తలసాని, మాగంటి గోపీ, పువ్వాడ అజయ్ నిరసనల్లో పాల్గొనడం విడ్డూరంగా ఉందన్నారు. వాళ్లు కూడా రేబాన్ కళ్లద్దాలు పెట్టుకుని, బుల్లెట్ బళ్లు ఎక్కి సినిమా షూటింగులకు వచ్చినట్టు నిరసన తెలిపారని..కేటీఆర్ ఏమో రిబ్బన్లు కట్ చేస్తూ, ట్విట్టర్లలో పిలుపుస్తూ నిరసన కార్యక్రమానికి దూరంగా ఉన్నారని గుర్తు చేశారు. హరీష్ రావు కూడా అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష పేరుతో నిరసనల్లో ఎక్కడా నేరుగా పాల్గొనలేదని చెప్పారు. ఎంపీ సంతోష్ రావేమో ఢిల్లీలో మొక్కలు నాటుకుంటూ కాలక్షేపం చేశారని గుర్తు చేశారు. ఇక కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్లో చిలక పలుకులు పలకడం తప్ప ఎక్కడా ప్రత్యక్షంగా నిరసనలలో పాల్గొనకపోవడాన్ని రేవంత్ తప్పు పట్టారు. కేసీఆర్ ఎక్కడున్నాడో తెలంగాణ సమాజానికి తెలియని పరిస్థితి ఉందన్నారు.
మోదీ తెలంగాణ సమాజంపై విషం చిమ్మి ఐదు రోజులైనా కేసీఆర్ ఖండించలేదన్నారు. కాంగ్రెస్ కార్యచరణ తీసుకోవడంతో తప్పని పరిస్థితుల్లో నిరసనలకు వచ్చారన్నారు. తెలంగాణ కోసమే పుట్టానని చెప్పే కేసీఆర్ ఎక్కడ దాక్కున్నాడు.

ఐదు రోజులుగా కేసీఆర్ కుటుంబ సభ్యులను గమనించండి. కేటీఆర్ ప్రారంభోత్సవాలు, హరీష్ సమీక్షలు అంటున్నారు, సంతోష్ ఢిల్లీ వీధుల్లో మొక్కలు నాటుతున్నాడు. కవిత ట్విట్టర్ లో చిలక పలుకులు పలుకున్నారు. కేసీఆర్ కనిపించనే లేదు. ఈ ఐదుగురు ఎక్కడైనా నిరసనలో పాల్గొన్నారా? మోదీ అంటే భయమా… అభిమానమా… ఆయనేమైనా మీ కుటుంబ పెద్దనా? మీ దోపిడీ వల్ల భయపడుతున్నారా అని రేవంత్ ప్రశ్నించారు.

మోదీకి వ్యతిరేకంగా తెలంగాణ సమాజం దిష్ఠిబొమ్మలు తగలబెడుతుంటే కేసీఆర్ కుటుంబం ఎందుకు పాల్గొనలేదని..ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి పదవుల్లో ఉన్నారు కదా! బాధ్యత లేదా అని ప్రశ్నించారు. మీరు బీజేపీకి దళారులుగా మారారు. మీరు దందాలు చేస్తున్నారు. బీజేపీకి లొంగిపోయారు. మోదీకి తాబేదార్లుగా మారిపోయారు అని మండిపడ్డారు. స్పందించకుండా ఉండటానికి కేసీఆర్ కు సిగ్గు అనిపించలేదా అని రేవంత్ ప్రశ్నించారు. కేటీఆర్ రిబ్బన్లు కట్ చేస్తున్నాడు, ఫోటోలు దిగుతున్నాడు, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానంటున్నాడు. మరి నిరసనలో ఎందుకు పాల్గొనలేదు. తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని ప్రధాని చూపిస్తుంటే చీమకుట్టినట్టైనా అనిపించలేదా. చీము నెత్తురూ లేదా…అని టీఆర్ఎస్ నాయకులను రేవంత్ నిలదీశారు.
నేనే రాజ్యం రాజ్యమే నేను అన్నట్టు కేసీఆర్ తీరు ఉందని..నా కడుపు నిండితే చాలు రాష్ట్ర ప్రయోజనాలు చేకూరినట్టే అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మధ్యయుగపు చక్రవర్తుల్లా కేసీఆర్ ఆలోచన ఉందన్నారు. నిన్ను తిడితే, నీ అవినీతిని ప్రశ్నిస్తే తెలంగాణ సమస్య అంటావు… తెలంగాణకు అవమానం జరుగుతుంటే మాత్రం నీకు పట్టదా అని కేసీఆర్ ను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

జనగాంలో ఇదే విషయాన్ని అడుగుదామని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నిస్తారని వాళ్లను ముందుస్తు అక్రమ అరెస్టులు చేశారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు అధికారం శాశ్వతం కాదని, పోలీసులు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచన చేయాలని… లేని పక్షంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అలాంటి పోలీసులను టీఆర్ఎస్ కాదు కదా… దేవుడు కూడా కాపాడలేడని హెచ్చరించారు.
మోదీ క్షమాపణ చెబితేనే… ఈ గడ్డపైకి రానిస్తాంతెలంగాణ రాష్ట్ర అస్థిత్వాన్ని, ఉనికిని, ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అదే పార్లమెంట్ లోని ఉభయ సభల్లో క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ప్రధానితో క్షమాపణ చెప్పించే బాధ్యతను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రాన్ని అవమానించి, ఈ రాష్ట్ర ప్రజల ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు రేవంత్. తెలంగాణను అవమానించిన మోదీ నాయకత్వంలో ఎందుకు ఉండాలో బండి సంజయ్, అరవింద్ లు గుండెలపై చేయి వేసుకుని ఆత్మపరిశీలన చేసుకోవాలని రేవంత్ సూచించారు. అలాంటి నాయకత్వంలో ఉండి, ఇక్కడ ప్రజలకు ఏం సందేశం ఇస్తారని ప్రశ్నించారు.

విభజన చట్టంలో కాంగ్రెస్ అనేక హామీలు ఇస్తే, దాని కంటే ముందే 2013లో ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇస్తే వాటన్నింటినీ రద్దు చేసిన మోదీకి ఈ సమాజం ఎందుకు మద్ధతివ్వాలని ప్రశ్నించారు. పార్లమెంట్ వేదికగా తెలంగాణ సమాజానికి మోదీ క్షమాపణ చెప్పకపోతే ఈ గడ్డపై కాలు పెట్టనివ్వమి… తెలంగాణ అమరవీరులు, కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. బీజేపీ అనుబంధ విభాగాలైన ఈడీ, సీబీఐ, ఐటీలకు భయపడేది లేదన్నారు. మోదీ వ్యాఖ్యలపై కేసీఆర్, ఆయన కుటుంబం వైఖరి బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి చెప్పాలి. జనగామ వేదికగా కేసీఆర్ సమాధానం చెప్పాలి. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో కేసీఆర్ పాత్ర గుండు సున్నా అని రేవంత్ చెప్పారు.