ఆనందయ్యను మళ్లీ ఎందుకు నిర్బంధించారు ?

anandhaiah covid medicine anandhaiah ayurveda medicine bida ravichandra yadav

0
34

‘‘కృష్ణపట్నం ఆనందయ్యను ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది. వెంటనే విడుదల చేసి ఇంటికి చేర్చాలి. భద్రత పేరుతో హింసించడం సరికాదు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా ఆనందయ్య కుటుంబం ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేస్తోందన్నారు. ఆయనపై నమ్మకం ఉన్న ఎందరో మందులు తీసుకుని ఆరోగ్యంగా ఉంటున్నారని చెప్పారు.

ఇదే క్రమంలో కోవిడ్ కోసం తయారుచేసిన మందుకు కూడా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. కృష్ణపట్నంలోని తన తోటలో రోజూ వేలాది మందికి ఆనందయ్య ఉచితంగా మందు ఇస్తూ వచ్చారని, సాఫీగా సాగిపోతున్న ఈ కార్యక్రమంపై మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, జిల్లా అధికారుల కన్నుపడటంతో గందరగోళం నెలకొందని ఆరోపించారు.

దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఆనందయ్య మందు కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ప్రభుత్వమేమో అనుమతులు, పరీక్షల పేరుతో రెండు వారాలుగా జాప్యం చేస్తూ వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు అధికార పార్టీ వారు భద్రత పేరుతో ఆనందయ్యను నిర్బంధించి వేలాది మందికి మందు తయారు చేయించుకుంటున్నారని ఆరోపించారు.

చాలా రోజుల నిర్బంధం నుంచి విముక్తి పొంది నిన్న మధ్యాహ్నం ఇంటికి వచ్చిన ఆనందయ్యను మళ్లీ ఎందుకు నిర్బంధించారని ప్రశ్నించారు. గ్రామస్తులు తిరగబడటంతో రాత్రి వ్యూహాత్మక మౌనం దాల్చిన పోలీసులు ఈ రోజు వేకువజామున ఆయనను బలవంతంగా తరలించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఆనందయ్యకు తన కుటుంబంతో స్వేచ్ఛగా ఉండకుండా నిర్బంధించే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని నిలదీశారు. అసలు ఆనందయ్యను ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలన్నారు.

వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆనందయ్యకు స్వేచ్ఛతో కూడిన భద్రత కల్పించి అనుమతుల విషయం త్వరగా తేల్చాలని డిమాండ్ చేశారు.