మాజీమంత్రిని పక్కనపెట్టిన సీఎం జగన్… నిజమేనా ?

మాజీమంత్రిని పక్కనపెట్టిన సీఎం జగన్... నిజమేనా ?

0
33

రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన నేతలు… ఆ తరువాత సైలెంట్‌గా ఉండిపోవాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. తాజాగా ఏపీలోని సీనియర్ రాజకీయ నేత పరిస్థితి ఇలాగే ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆయన మరెవరో కాదు. వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు. సీఎం జగన్ తండ్రి, దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ధర్మాన ప్రసాదరావు… ఆయన కేబినెట్‌లో కీలక మంత్రిగా చక్రం తిప్పారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఓడిపోయిన ధర్మాన… 2019 ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆయన మళ్లీ మంత్రి కావడం ఖాయమనే ఊహాగానాలు బలంగా వినిపించాయి.

అయితే జగన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచించారు. ధర్మానను పక్కనపెట్టి ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్‌ను కేబినెట్‌లోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత తమ్మినేని సీతారాంకు కీలకమైన స్పీకర్ పదవిని కట్టబెట్టారు. కానీ మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావుకు మాత్రం ఆశించిన స్థాయిలో జగన్ ప్రాధాన్యత ఇవ్వలేదు.

అయితే శ్రీకాకుళం ఎంపీ దువ్వాడ శ్రీనివాస్ ఓటమికి ధర్మాన ప్రసాదరావు కారణమనే భావనలో జగన్ ఉన్నారని… ఈ కారణంగానే ధర్మానను సీఎం జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదనే ఊహాగానాలు వైసీపీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కారణం ఏదైనా… ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ధర్మాన ప్రసాదరావు… ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు.