కోకాపేటలో ఎకరం భూమి 60 కోట్లకు అమ్ముడుపోయింది. తెలంగాణ సర్కారు అనుకున్నట్లుగానే కోకాపేట భూములు కాసుల వర్షమే కురిపించాయి. ఒక్క వేలంతో సర్కారు ఖజానాకు 2వేల కోట్లు వచ్చి చేరాయి. బడా బడా నిర్మాణ సంస్థలు వేలంలో పాల్గొని 49.94 ఎకరాల భూములను దక్కించుకున్నాయి.
కోకాపేటలో ప్రభుత్వం అభివృద్ధి చేసిన భూములను గురువారం హెచ్ఎండిఎ వేలం వేసింది. ఈ భూములకు అంచనాలకు మించి ధర పలికింది. వేలంలో ప్లాట్లను దక్కించుకునేందుకు నిర్మాణ సంస్థలు పోటీ పడి ధర పెంచుకుంటూ పోయాయి. ఇందులో ఉన్న భూమిని 14 ప్లాట్లుగా విభజించి వేలం వేసింది హెచ్ఎండి. వీటిలో 1.65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్ కు తీవ్ర పోటీ నెలకొంది. దాన్ని 60.2 కోట్లకు రాజపుష్ప రియాల్టీ ఎల్ఎల్పి సంస్థ దక్కించుకుంది.
కోకాపేటలో ప్రభుత్వం రైతుల నుంచి 2006 ప్రాంతంలో వాణిజ్య అవసరాల కోసం భూములను సేకరించారు. అట్టి భూముల్లో 719 ఎకరాల భూమిని విక్రయించే బాధ్యతను గతంలో ప్రభుత్వం హెచ్ఎండిఎకు అప్పగించింది. గోల్డెన్ మైన్ పేరుతో లేఅవుట్ ను అభివృద్ధి చేసి 166 ఎకరాలను 1755 కోట్ల రూపాయలకు గతంలో హెచ్ఎండిఎ అమ్మేసింది. వివిధ సంస్థలకు కేటాయింపులు పోను మిగిలిన 110 ఎకరాల్లో నియో పొలిస్ పేరుతో ఇంకో భారీ లేఅవుట్ డెవలప్ చేసింది. దీన్ని 14 ప్లాట్లుగా విభజించి ఎకరా కనీస ధర 25 కోట్లగా వేలానికి పెట్టింది.
బడా వ్యాపారవేత్తలను ఆకర్షించేందుకు ఈ లేఅవుట్ ను మల్టిపర్పస్ జోన్ గా నోటిఫై చేసి మౌలిక సదుపాయాలను కల్పించింది. ఇక్కడినుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుపైకి చేరుకునేలా నార్సింగి ఏరియాలో రాకపోకల సదుపాయాన్ని కల్పించింది. గురువారం జరిగిన ఈ-వేలంలో మొదట 4 ప్లాట్లను వేలానికి పెట్టారు. మధ్యాహ్నం మరో నాలుగు ప్లాట్లను వేలానికి పెట్టారు. రియల్టర్ల నుంచి మంచి స్పందన వచ్చింది.
వేలంలో ఈ ప్లాట్లను దక్కించుకున్న సంస్థల పేర్లు…
సత్యనారాయణరెడ్డి మన్నె
రాజపుష్ప ప్రాపర్టీస్
ఆక్వాస్పేస్ డెవలపర్స్
ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్
వర్సిటీ ఎడ్యూకేషన్ మేనేజ్ మెంట్
హైమ డెవలపర్స్
రాజపుష్ప రియాల్టీ ఎల్ఎల్పి
ఉన్నాయి.
దీనికి సంబంధించి Real Estate Tv వారు రిలీజ్ చేసిన వీడియో పైన ఉంది చూడొచ్చు.