తెలంగాణలో ప్రాపర్టీ విలువల పెంపు : ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు

0
227

తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువలు పెంచేందుకు సర్కారు పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. భూములు, ఆస్తుల విలువలు పెంచడంతోపాటు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన సాఫ్ట్ వేర్ కూడా రెడీ అయింది. ఇక ఉత్తర్వులు రావడమే తరువాయి అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఏ క్షణంలోనైనా దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి. మంగళవారం జరిగిన తొలిరోజు కేబినెట్ సమావేశంలోనూ దీనిపై చర్చించారు.

గత ఏడాది ఫిబ్రవరిలో సబ్ రిజిస్ట్రార్లు సిసిఎల్ఎ కమిషనర్ కు సమర్పించిన మార్కెట్ విలువను పరిగణలోకి తీసుకుని ఛార్జీల పెంపును ఖరారు చేసినట్లు తెలిసింది. నాన్ అగ్రికల్చర్ భూముల విలువను సంబంధిత ఏరియాను బ్టటి గరిష్టంగా 50 శాతం పెంచనున్నట్లు తెలిసింది. అగ్రికల్చర్ భూముల విలువను కూడా ఆయా ప్రాంతాలనుబట్టి 20 శాతం నుంచి 40 శాతానికి పెంచే ఆలోచనలో ఉన్నారు.

భూములు, ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ సందర్భంగా ప్రస్తుతం స్టాంప్ డ్యూటీ 4శాతం ట్రాన్స్ఫర్ డ్యూటీ 1.5శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5 శాతం కలిపి మొత్తంగా 6 శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీన్ని కూడా 7 శాతానికి పెంచే చాన్స్ ఉందని అధికార వర్గాలు అంటున్నాయి.

కేబినెట్ సమావేశంలో ఈ విషయంపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలిసింది. భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. అన్ని రకాల రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లకు ప్రస్తుతం వసూలు చేస్తున్న ఛార్జీలను కూడా పెంచనున్నారు.

మంగళవారం సాయంత్రం నుంచే పెంచిన ఛార్జీలు అమలులోకి వస్తాయని ప్రచారం జరిగింది తాము చెప్పే వరకు ఆఫీసులు వదిలి వెళ్లొద్దని జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లకు మంగళవారం ఉదయం అత్యవసర ఆదేశాలు అందాయి. అయితే భూముల విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు విషయంలో పలువురు మంత్రులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పెంపు వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమో అని అనుమనాలను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీటిపెంపుపై బుధవారం మరోసారి చర్చించి ఫైనల్ చేయాలని నిర్ణయించారు.

పెండింగ్ లో పెట్టాలని నిర్ణయించిన తర్వాతనే మంగళవారం సాయంత్రం  7 గంటల ప్రాంతంలో రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ‘‘మీరు వెళ్లిపోవచ్చు… ఇంకా ఫైనల్ కాలేదు’’ అని రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు సమాచారం చేరవేశారు. కానీ బుధవారం సాయంత్రమే భూముల విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ఉత్తర్వులు జారీ కావొచ్చని అధికార వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి దీనిపై ఏరకమైన ఉత్తర్వులు వస్తాయోనని భూ యజమానులు, రియల్టర్స్, అమ్మకందారులు, కొనుగోలుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయా వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.