బీ అలర్ట్..రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు

0
40

తెలంగాణ ప్రజలకు అలెర్ట్. ఇప్పటికే కురిసిన వర్షాలకు హైదరాబాద్ తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే రానున్న 2 రోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

గాలులు నైరుతి దిశ నుంచి తెలంగాణవైపు వీస్తున్నాయని..దీనితో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కాగా ఇప్పటికే సిద్దిపేటలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం కురవగా, సంగారెడ్డిలోని సాత్ వార్ లో నాలుగు సెంటీమీటర్లు, జనగామలోని తాటి కొండలో 3 సెంటీమీటర్లు, కామారెడ్డిలో రెండు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.

ఇప్పటికే వర్షాలు పడడంతో రైతులు జోరుగా విత్తనాలు నాటుతున్నారు. నారుమళ్లను సిద్ధం చేసుకొని నార్లు కూడా పోస్తున్నారు. ఇక ఇవాళ, రేపు ఉత్తర తెలంగాణ లోని పలు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాలు కురవనున్న క్రమంలో రైతులు నారుమళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు.