మానవత్వం చాటుకున్న సిఐ అదిరెడ్డి

CI Adireddy who expressed humanity

0
41
తెలంగాణ: పోలీస్ విధి నిర్వహణ అంటేనే ఎన్నో ఆటుపోట్లు. మరెన్నో సవాళ్లు. వాటన్నింటిని తట్టుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎండ, వాన తేడా లేకుండా పని చేస్తుంటారు పోలీసులు. ఇలా ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మానవత్వాన్ని ప్రదర్శిస్తూ చేసే కొన్ని చర్యలు అందరి చేత శభాష్ అనిపించుకుంటుంటాయి. అలాంటి ఘటనే నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది.

పది రోజుల క్రితం నల్లగొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద గుర్తు తెలియని వ్యక్తి పర్సు పోగొట్టుకున్నాడు. అందులో నగదు, ఏటీఎం కార్డు, ఇతర పేపర్స్ ఉన్నాయి. ఎట్టకేలకు వాటిని శుక్రవారం నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా పోగొట్టుకున్న వ్యక్తి సంబంధీకులకు అప్పగించి మానవత్వం చాటుకున్నారు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ కె. అదిరెడ్డి.

విధి నిర్వహణలో భాగంగా పది రోజుల క్రితం కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న ఆదిరెడ్డికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పర్సు రోడ్డుపై లభించింది. అందులో 5,620/- నగదు, ఏటీఎం కార్డు, ఇతర పేపర్స్ ఉండగా పోగొట్టుకున్న వ్యక్తికి సంబంధించిన ఎలాంటి ఆచూకీ అందులో లేకపోవడంతో ఆయన పర్సులో ఉన్న ఏటీఎం కార్డు ఆధారంగా బ్యాంకు అధికారులతో సంప్రదించి అతని ఫోన్ నెంబర్ తెలుసుకున్నారు.

దీనితో ఆయన ఒంగోలుకు చెందిన అనిల్ కుమార్ చౌదరిగా గుర్తించి సమాచారం అందించారు. శుక్రవారం అనిల్ కుమార్ చౌదరి సంబంధీకులు నల్లగొండకు రాగా డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా సిఐ ఆదిరెడ్డి తనకు దొరికిన పర్సు, అందులో ఉన్న నగదు, ఏటీఎం కార్డు, ఇతర పత్రాలను అందజేసి తన మానవత్వం చాటుకున్నారు. సిఐ అదిరెడ్డి నిజాయితీ, మానవత్వం పట్ల అనిల్ కుమార్ చౌదరి, ఆయన సంబంధీకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి సిఐ అదిరెడ్డిని అభినందించారు.