పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైన ఘట్టం. అలాంటి వేడుకలో ఎన్నో గుర్తుబడిపోయే అనుభవాలు ఉంటాయి. ఇందులో ఒకటి అరుంధతి నక్షత్రాన్ని చూపించే ఆనవాయితీ. పెళ్లికూతురికి పెళ్లికుమారుడు ఆకాశంలో ఉన్న అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాడు. అసలు ఈ అరుంధతి ఎవరు..? నూతన వధూవరులకు అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అరుంధతీ దేవి మహాపతివ్రతల్లో ఒకరు. ఆమె వశిష్ట మహర్షి భార్య. అయితే అరుంధతీ దేవి ఎలా పుట్టిందో ఇప్పుడు చూద్దాం.. బ్రహ్మ కుమార్తె పేరు సంధ్యాదేవి. తనకు ఉపదేశం చేయడానికి బ్రహ్మచారి కావాలి. అతడి కోసం ముల్లోకాలు వెతకగా.. వశిష్టుడి గురించి తెలిసింది. అతడే తనకు ఉపదేశం చేయడానికి తగిన వాడని భావించి ఆయణ్ని ఆశ్రయించింది. వశిష్టుడు కూడా దానికి అంగీకరించి ఆమెకు ఉపదేశం చేశాడు. అయితే ఉపదేశం చేసిన తర్వాత సంధ్యాదేవి అగ్నిలో దూకింది. ఆ అగ్ని నుంచి ప్రాతఃసంధ్య, సాయం సంధ్యలతోపాటు ఓ స్త్రీమూర్తి రూపం ఆవిర్భవించింది. ఆ రూపమే అరుంధతీ దేవి.
ఇది జరిగిన కొంతకాలం తర్వాత వశిష్ఠుడు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని వధువు కోసం వెతకడం ప్రారంభించాడు. తనకు తగిన వధువు కోసం అన్వేషిస్తున్న వశిష్ఠుడు తనను పెళ్లిచేసుకోవాలనుకునే వారికి ఓ పరీక్ష పెట్టాడు. అదేంటంటే ఇసుకతో అన్నం వండటం. చేతిలో ఓ ఇసుక మూట పట్టుకుని దాంతో అన్నం వండగలిగే వారి కోసం అన్వేషణ సాగించాడు. ఆ అన్వేషణలో అరుంధతి తనకున్న దైవశక్తులతో ఇసుకతో అన్నం వండింది. తనకు తగిన జీవితభాగస్వామి అరుంధతియేనని భావించిన వశిష్ఠుడు ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. తన చేతి కమండలాన్ని ఆమెకిచ్చి తాను తిరిగొచ్చేంతవరకు దాన్ని చూస్తూ ఉండమని చెప్పి వెళ్లాడు.
అలా వెళ్లిన వశిష్ఠుడు కొన్నేళ్లైనా తిరిగి రాలేదు. అయినా అరుంధతి ఆ కమండలాన్ని చూస్తూనే అతడి కోసం ఎదురుచూడ సాగింది. ఎందరో పండితులు, ఋషులు ఆమె దృష్టి మరల్చాలని ప్రయత్నించి విఫలమయ్యారు. చివరకు బ్రహ్మాదిదేవతల వల్ల కూడా కాలేదు. అందుకే వశిష్ఠుడిని తీసుకెళ్లి ఆమె ముందు నిలిపారు. దేవతల సమక్షంలో వశిష్ఠుడు అరుంధతిని వివాహమాడతాడు.
అరుంధతి తన సౌభాగ్య, పాతివ్రత్య దీక్షతో నక్షత్ర రూపంలో వెలుగుతూ ఆకాశంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అందుకే మూడుముళ్లు వేసిన తర్వాత వరుడు.. వధువుకి అరుంధతి నక్షత్రం చూపిస్తాడు. అరుంధతిలా సహనం, శాంతం, ఓర్పు, పాతివ్రత్య లక్షణాలు కలగి ఉండాలని..ఆ బంధం అరంధతి, వశిష్ఠుల్లా చిరస్థాయిగా వెలగాలని, నిలవాలని దాని అర్థం.