భారత్ ను వణికించిన కరోనా వేరియంట్ కు కొత్త పేరు ఇదే

New name for the corona variant

0
32

కరోనా వ్యాప్తి ఇప్పటి వరకు రెండు దశలుగా సాగింది. తొలి దశలో ఇంగ్లాండ్, అమెరికా, చైనా లాంటి దేశాల్లో వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. తొలి దశను భారత్ విజయవంతంగా ఎదుర్కొంది. కానీ సెకండ్ వేవ్ మాత్రం భారత్ ను వణికించింది. కోట్ల మందిని చిన్నాభిన్నం చేసింది. లక్షలాది మందిని పొట్టనపెట్టుకుంది. మొదటి వేవ్ లో ప్రభావం చూపని కరోనా రెండో వేవ్ లో అంత ప్రమాదకరంగా మారడానికి కారణాలేంటి? అన్నదానికి రకరకాల సమాధానాలున్నాయి.

ఇక ఇండియాను వణికించిన కరోనా వేరియంట్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేరును ఖరారు చేసింది. భారత్ లో వెలుగు చూసిన వేరియంట్ కు డెల్టా వేరియంట్ గా సోమవారం నామకరణం చేసింది.
సాంకేతికంగా బి1.617 గా పిలిచే ఈ వైరస్ రకం అధికారికంగా 53 దేశాల్లో కనిపించిందని డబ్ల్యూ.హెచ్.ఓ తెలిపింది.

ఈ వైరస్ రకాన్ని ఇండియన్ వేరియంట్ గా ప్రపచం దేశాలు పిలుస్తుండడాన్ని భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ కు ఫిర్యాదు చేసింది. అయితే వైరస్ రకాన్ని అది మొదట వెలుగు చూసిన దేశం పేరుతో పిలవకూడదని డబ్ల్యూ.హెచ్.ఓ స్పష్టం చేసింది. ఆ అలవాటును మాన్పించే దిశగా ఆ సంస్థ చొరవ చూపింది.

వైరస్ వేరియంట్లను సులభంగా ప్రస్తావించడానికి వీలుగా గ్రీకు వర్ణమాల లోని అక్షరాల పేర్లను ఖరారు చేస్తున్నది. ఈ విధానం వల్ల తమ భూభాగంలో కనిపించిన కొత్త వైరస్ రకాల గురించి వెల్లడించడానికి అనేక దేశాలు నిస్సంకోచంగా ముందుకొస్తాయని డబ్ల్యూ.హెచ్.ఓ అధికారులు అంటున్నారు. ఈ కొత్త స్కీమ్ కింద బ్రిటన్ లో వెలుగు చూసిన రకానికి అల్ఫా అని, దక్షిణాఫ్రికాలో తొలుత కనిపించిన వేరియంట్ కు బీటా అని, బ్రెజిల్ లో వెలుగుచూసిన వేరియంట్ కు గామా అని, భారత్ లో అంతకముందు కనిపించిన మరో వేరియంట్ కు కప్పా అనే పేర్లను ఖరారు చేశారు. గ్రీకు వర్ణమాలలో 24 అక్షరాలు ఉన్నాయి. అవన్నీ పూర్తయితే కొత్తగా వచ్చే కరోనా వేరియంట్స్ కు మరో శ్రేణి కింద పేర్లను పెడతామని డబ్ల్యూహెచ్ఓ అధికారులు వెల్లడించారు.