IND vs ENG | రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టులో భారత్ జట్టుకు ఇంగ్లాండ్ ధీటుగా సమాధానమిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లీష్ టీమ్ రెండు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో బెన్ డకెట్(133*), జో రూట్ (9*) ఉన్నారు.
ఓవర్‌నైట్ 326/5 స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన రోహిత్ సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రవీంద్ర జడేజా(112) రెండు పరుగులు మాత్రమే జోడించి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం రవిచంద్రన్ అశ్విన్ (37), అరంగేట్ర ప్లేయర్ ధ్రువ్ జురెల్(46) ఎనిమిదో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔట్ కావడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది. అయితే చివర్లలో బుమ్రా (26: 28 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) దూకుడుగా ఆడేయడంతో భారత్ స్కోరు 445 పరుగులకు చేరింది. అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ (131), సర్ఫరాజ్ ఖాన్ (62) కూడా అదరగొట్టారు.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాడ్ జట్టు ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్ బెన్ డెకెట్ వన్డే తరహాలో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, 88 బంతుల్లో సెంచరీ బాదేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయంటే ఎంత దూకుడుగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఒలీ పోప్ 39, జాక్ క్రాలే 15 పరుగులు చేశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 35 ఓవర్లలోనే 207 పరుగులు చేసింది. దీంతో 238 పరుగులు వెనుకంజలో ఉంది.
IND vs ENG | ఇదిలా ఉంటే క్రాలే వికెట్ తీసిన అశ్విన్.. టెస్టుల్లో 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. 500 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలవగా.. భారత్ తరపున రెండో బౌలర్‌గా నిలిచాడు. అశ్విన్ కంటే ముందు అనిల్ కుంబ్లే ఉన్నాడు. ఓవరాల్‌గా దిగ్గజ శ్రీలంక ప్లేయర్ ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.