World Cup 2023 | వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన్ మ్యాచ్‌లో రోహిత్ సేన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. భారత బౌలర్ల దెబ్బకు శ్రీలంక బ్యాటర్లు పెవిలియన్ క్యూ కట్టారు. దీంతో 19.4 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలగా.. 302 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్ చేరిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. ఇక ఓడిపోయిన శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 92, విరాట్ కోహ్లి 88, శ్రేయేస్ అయ్యర్ 82 పరుగులతో రాణించారు. ఫలితంగా ఒక్క బ్యాటర్ కూడా సెంచరీ చేయకుండానే ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా టీమిండియా నిలిచింది. లంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక ఐదు వికెట్లు పడగొట్టాడు.
World Cup 2023 | అనంతరం 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆటగాళ్లను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. ఇన్నింగ్స్ తొలిబంతికే పాతుమ్ నిశాంకను బుమ్రా ఔట్ చేసి లంకకు గట్టి షాక్ ఇచ్చాడు. తర్వాత మహ్మద్ సిరాజ్ దెబ్బకు వచ్చిన లంక బ్యాటర్లు వణికిపోయారు. ఒక్క పరుగు ఇవ్వకుండానే మొదటి ఏడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో మూడు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది శ్రీలంక.ఇక ఆ తర్వాత వచ్చిన మహ్మద్ షమీ అయితే తొలి ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. దాంతో 14 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన లంక.. 30,50 పరుగుల లోపు ఆలౌట్ అయ్యేలా కనిపించింది. అయితే చివరకు 55 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో షమీ 5 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు, బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు. మొత్తానికి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత్.. ఈ ప్రపంచకప్‌లో వరుసగా ఏడో విజయం సాధించి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.