దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత్ తొలిసారి టెస్ట్‌సిరీస్‌లో ఓటమి పాలయింది. అదీ సొంత గడ్డపై సిరీస్ ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తొలి టెస్ట్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడంలో కూడా భారత జట్టు విఫలమైంది. అదే విధంగా న్యూజిలాండ్ స్పిన్నర్లు చెలరేడిన పిచ్‌పై భారత బౌలర్ల అంతంత మాత్రంగానే రాణించలేకపోయారు. టెస్ట్ సిరీస్‌లో కివీస్ చేతులో చిత్తు కావడంతో సోషల్ మీడియా వేదికగా టీమిండియా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా వీటిపై భారత జట్టు సారధి రోహిత్ శర్మ(Rohit Sharma) ఘాటుగా స్పందించారు. ఓటమిని అంతలా పోస్ట్‌మార్టం చేయాల్సిన అవసరం లేదని, తమ తప్పులను తాము గమనించుకున్నామంటూ బదులిచ్చారు.
‘‘తొలి ఇన్నింగ్స్‌లో మేం సరిగా బ్యాటింగ్ చేయలేదు. పిచ్ విషయంలో ఇబ్బందేమీ లేదు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కివీస్ స్కోరుకు దగ్గరగా రాలేకపోయాం. మ్యాచ్ సాగే కొద్ది పిచ్‌లో భారీ మార్పులు వచ్చాయి. గిల్(Shubman Gill)-యశస్వి(Yashasvi Jaiswal) పాట్నర్‌షిప్ సమయంలో టీమ్ పరిస్థితి బాగానే ఉంది. కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇబ్బంది పడ్డాం. ఒత్తిడిని తట్టుకోవడంలో తీవ్రంగా విఫలమయ్యాం. అది కాదనలేని వాస్తవం. దాన్ని మేము కూడా అంగీకరిస్తున్నాం. 18 ఏళ్లుగా టెస్టుల్లో ఓటమెరుగని జట్టుగా నిలిచాం. ఎన్నో సవాళ్లు విసిరిన పిచ్‌లపై కూడా విజయాలు సాధించాం. ఎంతలేదనుకున్నా కొన్ని సార్లు ప్రణాళికలు తారుమారవుతాయి. ఓటములు తప్పవు. తొలి రెండు టెస్టుల్లో సరిగా రాణించలేకపోయాం. ఇక్కడ ఎవరి సామర్థ్యంపై సందేహపడాల్సిన పని లేదు. ఓటమిని మరీ ఎక్కువ పోస్ట్‌మార్టం చేయదల్చుకోలేదు. బ్యాటర్లు ప్రణాళికలపై నమ్మకం ఉంచాలి. న్యూజిలాండ్ ప్లేయర్లు చేసింది అదే’’ అని Rohit Sharma చెప్పాడు.