సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా అదరగొట్టింది. సఫారీ జట్టు నిర్దేశించిన 79 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో మరుపురాని విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో ధోనీ తర్వాత సఫారీ గడ్డపై సిరీస్ కోల్పోని రెండో కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. అలాగే కేవలం ఒకటిన్నర రోజులోనే టెస్ట్ మ్యాచ్ కూడా ముగియడం విశేషమే.
ఓవర్‌నైట్ 62/3 స్కోరుతో రెండో రోజు ఆట ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన దక్షిణాఫ్రికా 176 పరుగులకు ఆలౌట్ అయింది. జస్‌ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో ఏకంగా 6 వికెట్లు తీశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఆ జట్టు ఓపెనర్ మార్‌క్రమ్ మాత్రం దూకుడుగా ఆడుతూ 106 పరుగులు చేశాడు. దీంతో ఆ మాత్రం స్కోర్ అయినా ఆతిథ్య జట్టు చేయగలిగింది. ఇక భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ 2, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఒక్కో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాను మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో బెంబేలెత్తించాడు. ఆతిథ్య జట్టుకు పట్టపగలే చుక్కలు చూపించాడు. ఫలితంగా సౌతాఫ్రికా తొలి సెషన్‌లోనే 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ సేన 153 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 98 పరుగులు ఆధిక్యం లభించింది. కాగా తొలి టెస్టులో సఫారీ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే.