ఆసియా కప్ జట్టులో ఎంపిక కావడంపై తెలుగు ఆటగాడు తిలక్ వర్మ(Tilak Varma) తొలిసారిగా స్పందించాడు. ఆసియా కప్ లాంటి మెగా టోర్నీతో వన్డేల్లో అరంగేట్రం చేస్తానని ఊహించలేదని.. చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. ఇటీవలే టీ20ల్లో అరంగేట్రం చేసినా.. నెల రోజులు కాక ముందే వన్డేల్లో ఎంట్రీ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. తనకు మద్దతుగా నిలిచిన కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్న సమయంలో ఒత్తిడికి గురైన ప్రతీసారి రోహిత్(Rohit Sharma) తనకు సపోర్ట్‌గా నిలిచేవాడని.. తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవాడని గుర్తుచేసుకున్నాడు. రోహిత్ భాయ్ నుంచి ఆటకు సంబంధించిన చాలా విషయాలు నేర్చుకున్నానని వెల్లడించాడు. తుది జట్టులో తనకు ఆడే అవకాశం వస్తే సత్తా చాటుతానన్నాడు.
ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియాకప్ టోర్నీకి ఇటీవల భారత జట్టును బీసీసీఐ(BCCI) ప్రకటించిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా గాయాలతో జట్టుకు దూరంగా ఉంటున్న శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా టీంలోకి రీఎంట్రీ ఇచ్చారు.వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీ ముందు జరుగుతున్న టోర్నీ కావడంతో ప్రయోగాలకు దూరంగా ఉన్నారు సెలెక్టర్లు. మ్యాగ్జిమమ్ ఇదే జట్టు ప్రపంచకప్‌లో కూడా ఆడే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17వరకు ఆసియా కప్ జరగనుంది. సెప్టెంబర్ 2న ఇండియా-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభంకానుంది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ(Tilak Varma), శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్, షమీ, ప్రసిధ్ కృష్ణ, సంజూ శాంసన్( రిజర్వ్ ప్లేయర్).