IND vs NZ Semifinal |వరల్డ్ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (117), శ్రేయస్ (105) శతకాలతో అదరగొట్టారు. శుభ్‌మన్ గిల్ (80 నాటౌట్), రోహిత్ శర్మ (47) రాణించగా.. చివర్లో కేఎల్ రాహుల్ 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఇక కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ 100 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్ ఒక వికెట్ తీశాడు.
ఇదిలా ఉంటే ఈ మ్యాచులో భారత్ ఆటగాళ్లు పలు రికార్డులు నమోదు చేశారు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు(50) చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ క్రమంలో క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీల(49) రికార్డును బ్రేక్ చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేసి ఈ అరుదైన ఘనతను కోహ్లీ సొంతం చేసుకున్నాడు. సచిన్ 49 శతకాలు చేయడానికి 452 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. కోహ్లీ కేవలం 279 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డు అందుకోవడం విశేషం.
IND vs NZ Semifinal | వన్డే వరల్డ్ కప్ టోర్నీలలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. 51 సిక్సర్లతో తొలి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో క్రిస్ గేల్ (49), ఏబీ డీవిలియర్స్ (37), రిక్కీ పాంటింగ్ (31), బ్రెండన్ మెక్ కల్లమ్ (29) ఉన్నారు. అంతేకాకుండా వన్డేల్లో డివిలియర్స్ (58) రికార్డును బ్రేక్ చేసి ఒకే ఏడాదిలో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గానూ నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌ను డిస్నీ హాట్ స్టార్‌లో 5కోట్ల మంది లైవ్ స్ట్రీమింగ్‌లో చూసి రికార్డ్ సృష్టించారు.