తన కెరీర్‌కు యువరాజ్ సింగ్ చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేనంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అన్నాడు. కెరీర్ ప్రారంభంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడానికి కూడా యూవీ తనకు స్ఫూర్తిని ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన బ్యాటింగ్ స్టైల్, కెరీర్‌లో ఎదుర్కొన్న సవాళ్లను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హిట్‌మాన్. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన క్లిప్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. అయితే 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రంం చేసిన రోహిత్ అదే సంవత్సరం టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఆడాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. 2010లో ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో తనకు రోహిత్ ఎంతగానో సహాయపడ్డాడని, యూవీ వల్లే మళ్ళీ ఫామ్‌లోకి రాగలిగానని కూడా రోహిత్ చెప్పాడు.
‘‘జట్టులో స్థానం కోల్పోయినప్పుడు.. యూవీ(Yuvraj Singh) నాకు కీలక సూచనలు చేశాడు. ప్రతి ఒక్కరికి ఇలాంటి దశ అనేది ఒకటి వస్తుంది. అవకాశం అనేది ఎప్పుడు వచ్చినా దాన్ని ఆస్వాదించడానికి రెడీగా ఉండాలి అప్పుడే మనకు మానసికంగా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అతని మాటలు నన్ను ముందుకు నడిపించాయి. నా బ్యాటింగ్‌లో చాలా మార్పులు చేసుకున్నా. ఆ సమయంలో నా ఆటకు యూవీ ఉపయోగపడినంత మరెవరూ సహాయపడలేదు. ఫినిషర్‌గా మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకుని ఆడాల్సి ఉంటుంది. ఆ సమయంలో మన ప్రత్యర్థి కెప్టెన్ తరహాలో ఆలోచించి ఆడాల్సి ఉంటుంది. ఆ మాటలు నాపై ఎంతో ప్రభావం చూపాయి’’ అని రోహిత్(Rohit Sharma) ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు.