Telangana Budget: తెలంగాణ శాసనసభలో శుక్రవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ముందు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ వద్దకు మంత్రి కేటీఆర్(KTR) ప్రత్యేకంగా వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారి మధ్య సంభాషణ జరిగింది.
హుజూరాబాద్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని ఈటలను కేటీఆర్ ప్రశ్నించినట్లు తెలిసింది. పిలిస్తే కదా హాజరయ్యేది అంటూ ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి వెళ్లే ప్రాక్టీస్ సరిగా లేదని కేటీఆర్ కు ఈ సందర్భంగా ఈటల హితవు పలికారు. వారి మధ్య సంభాషణ జరుగుతుండగానే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అక్కడికి వెళ్లారు. తనను సైతం అధికారిక కార్యక్రమాలకు పిలవడం లేదని ఆయన ప్రస్తావించారు. మళ్లీ ఈటల(Etela) కలుగజేసుకుని కనీసం కలెక్టర్ నుంచైనా ఆహ్వానం ఉండాలన్నారు. ఆయన వ్యాఖ్యలకు కేటీఆర్ నవ్వి ఊరుకున్నారు.