కొన్నిరోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకులతం అవుతోంది. రోడ్లపైకి భారీగా వరదనీరు చేరి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు వరద నీరు పోటెత్తుతోంది. ఇప్పటికే హిమాయత్ సాగర్(Himayat Sagar) రిజర్వాయర్‌కు రెండు వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. రెండు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 1350 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
అయితే.. రిజర్వాయర్‌కు వరద ప్రవాహం ఇంకా కొనసాగుతుండటంతో తాజాగా మరో రెండు గేట్లను గురువారం సాయంత్రం 4:30 గంటలకు ఎత్తారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్(Himayat Sagar) రిజర్వాయర్‌కు మొత్తం 2200 ఇన్ ఫ్లో వస్తుండగా.. మొత్తం 4 గేట్ల ద్వారా 2750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఉస్మాన్ సాగర్‌కి సైతం భారీగా వరద నీరు చేరుకుంటోంది. దీంతో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.