నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన ఎస్. వీరన్న మహబూబాబాద్ లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. ఈ కేసులో 1982లో ఉమ్మడి వరంగల్ జిల్లా కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. దీంతో వీరన్నను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించగా.. 1984లో పెరోల్ పై విడుదలయ్యాడు. అప్పటికి వీరన్న వయసు 27 ఏళ్లు. అప్పటి నుంచి జైలు అధికారులకు దొరకకుండా తిరుగుతున్నాడు.
40 ఏళ్ల అనంతరం తాజాగా అతడి ఆచూకీ లభించింది. గురువారం విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీసుల సహకారంతో మహబూబాబాద్(Mahabubabad), వరంగల్ జైలు అధికారులు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో వీరన్నను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే చర్లపల్లి జైలుకు తరలించారు. మహబూబాబాద్ జైలర్ మల్లెల శ్రీనివాసరావు, వరంగల్ జైలు అధికారులు రామకృష్ణారెడ్డి, నాగరాజు, వార్డర్లు యాసిన్, రఘు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.