తెలంగాణ సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేరును ఫైనల్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కేసీ వేణుగోపాల్(KC Venugopal) ధృవీకరించారు. ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారని ఆయన తెలిపారు. ఈనెల 7న ఉదయం 10: 28 నిమిషాలకు ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం చేస్తారని వెల్లడించారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆదేశాల మేరకు.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, పలువురు కీలక నేతలతో సమీక్షలు జరిపిన అనంతరం సీఎంగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసినట్లు కేసీ తెలిపారు. సీనియర్లందరికీ న్యాయం చేస్తామని, వారంతా సుపరిపాలనకై రేవంత్ రెడ్డికి సహకరించాలని కోరారు. కాగా, అధిష్టానం పిలుపు మేరకు కొద్దిసేపటి క్రితం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. రేపు సోనియా గాంధీని, కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై అధిష్టానంతో చర్చించనున్నారు.
రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రొఫైల్…
1969 నవంబరు 8న పుట్టిన రేవంత్ రెడ్డి
నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టిన రేవంత్
2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం
2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా స్వాతంత్య్రంగా ఎన్నిక
2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు
2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్
2014–17 మధ్య వర్కింగ్ ప్రెసిడెంట్
2017 అక్టోబరులో టిడిపికి రాజీనామా
2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిక
2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి
2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం
2021లో జూన్ 26న పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్
2021 జూలై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం