Etela Rajender |జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ భోగ శ్రావణి(Boga Sravani) బీఆర్ఎస్ పార్టీకి, తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ లాంటి కష్ట సమయంలోనూ ప్రజల మధ్య ఉన్నానని పార్టీ కోసం పని చేశానన్నారు. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలతో పాటు హుజురాబాద్ మునుగోడు ఉప ఎన్నికల్లో తన భర్త ప్రవీణ్ పార్టీ కోసం పనిచేశారని పార్టీని నమ్ముకుని ఉన్న తనకు అధిష్టానం నుండి ఎలాంటి స్పందన రాకపోవడం బాధ కలిగించిందన్నారు. చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసినప్పటి నుండి ఇప్పటివరకు అధిష్టానం నుండి ఎలాంటి సహకారం అందలేదని ఆవేదన చెందారు. తాజాగా.. ఆమెను బీజేపీ(BJP) ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) కలిశారు. శ్రావణి పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆమెను కలసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులను గడ్డిపోచాలా తీసేపారేస్తోందని ఆరోపించారు. భోగ శ్రావణి కన్నీరు పెట్టిన ఉదంతాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలని అన్నారు.