లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ వెంకటేష్ నేత(MP Venkatesh) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నేత మన్నె జీవన్ రెడ్డి, పలువురు నేతలు కూడా పార్టీలో చేరారు. ప్రస్తుతం వెంకటేష్ నేత పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు.
కాగా ఇటీవల స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్యెల్యే తాటికొండ రాజయ్య(Thatokonda Rajaiah) కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి వీర విధేయుడిగా ఉన్నప్పటికీ తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక వేదన భరించలేని బాధను కలిగించిందన్నారు. గత ఆరు నెలలుగా తీవ్ర మనోవేదనకు గురవుతున్నానని తెలిపారు. పార్టీ విధివిధానాలు నచ్చకపోవడం వల్ల రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల వేళ పార్టీకి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరు రాజీనామా చేయడం గులాబీ పార్టీకి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .