రూ.50 లక్షల నగదుతో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) కామారెడ్డిలో తనపై పోటీకి దిగుతున్నారని కేసీఆర్(CM KCR) తీవ్ర విమర్శలు చేశారు. అలాంటి రేవంత్‌కు కామారెడ్డి ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు. కామారెడ్డిలో నామినేషన్ వేసిన అనంతరం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలని తెలిపారు. కామారెడ్డి(Kamareddy) నియోజకవర్గంతో తనకు పుట్టినప్పటి నుంచి అనుబంధం ఉందని.. తన తల్లి పుట్టింది ఈ నియోజకవర్గంలోని కోనాపూర్‌గా పిలిచే పోసానిపల్లి గ్రామంలోనే అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో 45 రోజుల పాటు ఇక్కడ జలసౌధ ఉద్యమం చేశామని.. ఆ సమయంలో ఇక్కడి లాయర్లు చైతన్యం చూపారన్నారు.
కామారెడ్డి నుంచి పోటీ చేయాలని సిట్టింగ్ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ తనను చాలా సార్లు కోరారని అందుకే పోటీ చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో కామారెడ్డిని జిల్లాగా చేయడంతో పాటు ఇక్కడికి మెడికల్ కాలేజీని తెచ్చామని వెల్లడించారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం… తెలంగాణ ప్రజల కోసమన్నారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు నీళ్లు తెస్తామన్నారు. కామారెడ్డిని అద్భుత నియోజకవర్గంగా మార్చి చూపిస్తానన్నారు.
తొలిసారి ఈ ఎన్నికల్లో కేసీఆర్(CM KCR) రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తు్న్న సంగతి తెలిసిందే. ఈరోజు మంచి రోజు కావడంతో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం గజ్వేల్, మధ్యాహ్నం కామారెడ్డిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. మరోవైపు గజ్వేల్‌లో కేసీఆర్‌పై బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కామారెడ్డిలో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల పోరు రసవత్తరంగా మారింది.