ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రధాని మోదీ(PM Modi) సంచలన ప్రకటన చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన మాదిగల విశ్వరూప సభ(Madiga Vishwarupa Mahasabha)లో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలో ఓ కమిటీ వేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వర్గీకరణ కోసం మందకృష్ణ చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దళిత విరోధులని.. ఆ రెండు పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరించారు. అధికారంలోకి రాగానే దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని.. మూడెకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో అంబేడ్కర్‌ను రెండుసార్లు ఓడించారని.. కానీ బీజేపీ హయాంలో పార్లమెంట్ సెంట్రల్ హాలులో అంబేడ్కర్ చిత్రపటం పెట్టామని భారతరత్న ఇచ్చామన్నారు. దళిత వర్గాలకు చెందిన రామ్ నాథ్ కోవింద్‌ను, గిరిజన మహిళను తొలిసారిగా రాష్ట్రపతిగా చేశామని గుర్తుచేశారు. అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం చేసేందుకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టంచేశారు.
సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్.. అనేది బీజేపీ విధానం.. పేదరిక నిర్మూలనే తమ ప్రధాన లక్ష్యమని మోదీ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి ఎన్నో ప్రభుత్వాలు మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చాయి కానీ నెరవేర్చలేదన్నారు. కానీ మీ బాధలు పంచుకునేందుకే ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు. మందకృష్ణ మాదిగ ముప్పై ఏళ్లుగా ఒక లక్ష్యం కోసం ఉద్యమిస్తున్నారన్నారు. తమ్ముడు కృష్ణా ఇన్నాళ్లు మీరు పోరాడారు… మీ ఉద్యమంలో తాను కూడా ఉంటానని భరోసా ఇస్తున్నానని చెప్పారు.
మందకృష్ణ కంటతడి.. ఓదార్చిన మోదీ..
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్జ మాదిగ(Manda Krishna Madiga) మాట్లాడుతూ మాదిగల్ని సమాజంలో మనుషులుగా చూడలేదని తాము ఎదురైతే దూరం దూరం వెళ్లేవారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను పశువుల కంటే హీనంగా సమాజం చూసిందని.. అలాంటి సమాజంలో తమను గుర్తించి తమ సమస్యల్ని తెలుసుకునేందుకు దేశానికి పెద్దన్న అయిన ప్రధాని మోదీ వచ్చారంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రసంగం అనంతరం మోదీ వద్దకు వెళ్లి కంటతడి పెట్టారు. దీంతో మోదీ మందకృష్ణను భుజం తట్టి ఓదార్చారు. తెలంగాణలో బీసీని సీఎం చేస్తానని చెప్పిన దమ్మున్న నేత మోదీ(PM Modi) అని కొనియాడారు.